National Handloom Day 2023 : జాతీయ చేనేత దినోత్సవం(ఆగస్టు 7) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. ప్రతి సంవత్సరం సర్కార్ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనం నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఈ నెల 7 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సర్కార్ ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. మగ్గాల నవీకరణ, నేతన్నలకు ఆరోగ్యకార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఏటా రూ.95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ వంటివి ఇందులో ఉన్నాయి.
Health Cards for Handloom Workers in Telangana : చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ఇవాళ వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై అధ్యయనం అనంతరం అధికారులతో కేటీఆర్.. సమావేశమై తొమ్మిది అంశాలపై ప్రతిపాదనలు రూపొందించారు. వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. చేనేత కార్మికులకు, చేనేత వృత్తి పనిచేస్తున్నవారికి నేత్ర, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటికి ఆరోగ్యకార్డు ద్వారా చికిత్స అందిస్తారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేల పరిమితి మేరకు వైద్యసేవలు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. చేనేత కార్మికులకు పనిభారం, అనారోగ్య సమస్యలను నివారించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్ మగ్గాలను స్థాపించనున్నారు. ఒక్కో ఫ్రేమ్ మగ్గం ఏర్పాటుకు రూ.38వేల చొప్పున ఈ పథకానికి రూ.40.50 కోట్లను కేటాయించనుంది.
వారికి కూడా వర్తించనున్న బీమా పథకం :గత ఆగస్టు నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుండగా ఇకపై 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికీ వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోచంపల్లిలో మూతపడిన చేనేత పార్కును బ్యాంకులు వేలం వేయగా టెస్కో ద్వారా ప్రభుత్వం కొన్నది. దీనిని దేశంలోనే అతిపెద్ద చేనేత పార్కుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. చేనేత సంఘాలపై రుణభారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకం కింద 2022-23 సంవత్సరానికి రూ.2.13 కోట్ల విడుదల. నేతన్నకు చేయూత పథకం కింద కార్మికులు 8% వేతనాలను జమ చేస్తే ప్రభుత్వం దానికి 16 శాతాన్ని వారిపేరిట జమ చేస్తోంది. ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చేనేత మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్ : రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా డీసీసీబీలు క్యాష్ క్రెడిట్‌ను అమలు చేయనున్నాయి. దీన్ని వర్కింగ్ క్యాపిటల్‌గా ఉపయోగించుకొని సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. దేశంలో తొలిసారిగాచేనేత మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్‌లోని శిల్పారామం వద్ద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇవాళ మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తారు. ఉప్పల్ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.