జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన అరిశెనపల్లి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. ఈనెల 18న ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవగా అధ్యక్ష పదవికి జగన్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో కీడ్రా సంఘానికి అధ్యక్షుడిగా తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక వ్యక్తిగా జగన్ నిలిచారు.
ఒలింపిక్ క్రీడైన హ్యాండ్‌బాల్ కార్యకలాపాల్లో 2018 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జగన్ మోహన్‌రావు 2019లో తెలంగాణ హ్యాండ్‌బాల్ సంఘం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తర్వాత ఆసియా హ్యాండ్ బాల్, ఇంటర్డిస్ట్రిక్ట్ జాతీయ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు.