తెలంగాణ

telangana

ETV Bharat / state

నదుల మేనిఫెస్టో తయారీనే ప్రధాన అజెండా: వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా - ts news

National Convention of Rivers: జీవనం, నాగరికత, సంస్కృతికి నెలవైన నదులను కాపాడుకోపోతే భవిష్యత్​లో ఇబ్బందికర పరిణామాలు తప్పవని జాతీయ సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. నదుల పరిరక్షణ, పునరుద్ధరణ దిశగా అడుగులు పడకపోవడంపై ఆవేదన వ్యక్తమైంది. సామాజిక ఒత్తిడి తేవడం ద్వారా ప్రభుత్వాలు నదుల పరిరక్షణ దిశగా చర్యలు తీసుకునే పరిస్థితులు కల్పించాలని అభిప్రాయపడింది. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలో నదుల పరిరక్షణ అంశం భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించింది.

National Convention on Rivers: నదులపై హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల జాతీయ సమ్మేళనం
National Convention on Rivers: నదులపై హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల జాతీయ సమ్మేళనం

By

Published : Feb 26, 2022, 1:38 PM IST

Updated : Feb 26, 2022, 3:25 PM IST

నదుల మేనిఫెస్టో తయారీనే ప్రధాన అజెండా: వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా

National Convention of Rivers: నదుల పరిరక్షణ, పునరుజ్జీవం ప్రధాన ఎజెండాగా హైదరాబాద్ వేదికగా రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. విశ్వేశ్వరయ్య భవన్​లో జరుగుతున్న సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్, న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వి.ప్రకాశ్ రావు, ఇతరులు పాల్గొన్నారు. సదస్సుకు దేశంలోని 27 రాష్ట్రాల్లో నీటిసంరక్షణ, నదుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతినిధులు హాజరయ్యారు.

ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..

నాగరికతకు నెలువైన నదులను ఎవరూ పట్టించుకోవడం లేదన్న మంత్రి నిరంజన్ రెడ్డి... వ్యర్థాలతో నిండి కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్​లో ప్రపంచ వ్యాప్తంగా నీటి కోసమే పోరాటాలు జరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను సజీవం చేస్తోందన్న ఆయన... రికార్డు సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి 200 కిలోమీటర్ల మేర సజీవంగా ఉందని వివరించారు. నదుల్లోకి వ్యర్థాలు వెళ్లకుండా, భూమి కోతకు గురికాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఏడేళ్ల కాలంలో మూడు శాతం పచ్చదనం పెరిగిందంటే తెలంగాణ పరిస్థితులు అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో వలస వెళ్లిన ప్రజలతో పాటు పక్షులు కూడా పాలమూరుకు తిరిగివస్తున్నాయని చెప్పారు. ఎంత పంట పండినా దాన్ని అవసరం ఉన్న చోట వినియోగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కార్యక్రమాలకు దేశానికి దిక్సూచి కావాలని ఆకాంక్షించిన మంత్రి.. ఈ తరహా కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కోరారు.

నదులు నాలాలుగా మారితే..

చదువుకున్న వారు అధికంగా ఉన్న దిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లోనే నదులు పాడవుతున్నాయని వాటర్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా రాజేంద్రసింగ్ తెలిపారు. హైదరాబాద్​లోనూ మూసీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు. నదులు నాలాలుగా మారితే భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతామని ప్రశ్నించారు. నదుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినా అవి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల సదస్సులో రివర్ మేనిఫెస్టో పేరిట నదుల ఘోషణా పత్రాన్ని రూపొందిస్తామని రాజేంద్రసింగ్ వివరించారు.

నదుల మేనిఫెస్టో రూపొందించడమే..

'నదులకు మనిషి హోదా కల్పించాలి. భారత రాజ్యాంగం అమలుకు ముందు ప్రజలు నదిని మాతృమూర్తిలా చూసుకునేవారు. రాజ్యాంగం ప్రకారం నదికి మనిషి హోదా కల్పించేలా కృషి చేయడమే ఈ సమ్మేళనం లక్ష్యం. నదుల తరుఫున ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. నదుల మేనిఫెస్టో రూపొందించడమే ఈ సమ్మేళనం కర్తవ్యం.'

-రాజేంద్రసింగ్‌, జలవనరుల నిపుణుడు

నదుల పరిరక్షణ రాజకీయ మేనిఫెస్టోలో భాగస్వామ్యం కావాలి..

నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు సాంకేతిక విధానాలను అనుసరించాలని రాజ్యాంగంలో ఉందని న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్ తెలిపారు. ఎవరూ అమలు చేయడం లేదని అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్​లో ఉన్న చెరువులన్నీ ఇప్పుడు కాలనీలుగా మారాయన్న ఆయన.. సరస్వతి నది అంతర్వాహిని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దేశంలోని ఇతర నదులకు కూడా ఆ ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లోకి వ్యర్థాలను వదిలే పరిశ్రమలకు నీరు, విద్యుత్ ఆపివేయాలని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. నదుల పరిరక్షణ అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

రివర్ మేనిఫెస్టోకు రూపకల్పన

రెండు రోజుల పాటు జరగనున్న సదస్సులో దేశ వ్యాప్తంగా నదుల పరిస్థితులపై చర్చించడంతో పాటు సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల్లో నదులు, జలసంరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలపైనా చర్చ జరుగుతుంది. రివర్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేస్తారు. నదులు, జలసంరక్షణ కోసం పాటుపడుతున్న వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేలా సుజలభారతి జర్నల్, వెబ్​సైట్​ను సదస్సులో ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 26, 2022, 3:25 PM IST

ABOUT THE AUTHOR

...view details