BC Commission Chairman Hansraj Hyderabad tour : జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్‌రాజ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. నగరంలోని బేగంపేట హరిత ప్లాజాలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీసీ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలుపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆ దిశగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలలో వెనుకబడిన వార్గాల వారిని సమీక్షించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు.
వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల కొరకు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య.. కేంద్ర స్థాయిలో ఇటు రాష్ట్రస్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జడ్జిల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి: సమావేశంలో 18 డిమాండ్లు చర్చించినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదని గుర్తు చేసిన ఆయన.. ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని కోరారు. పార్లమెంట్లో బీసీల బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో బీసీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారు. జడ్జిల్లో నియమించే నియామకాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.