ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా నాట్కో ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన నూతన కాంప్రహెన్సీవ్ కేన్సర్ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రిమోట్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్ ఈ రకంగా ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేన్సర్ సెంటర్ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన చికిత్సను అందించడానికి వీలు పడుతుందని అన్నారు.
రాష్ట్రంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. ఒకే రోజు 108 నూతన ఆంబులెన్స్‌లను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్న ఆయన.. చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే ఘట్టమన్నారు. ప్రతి పౌరుడి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌ను తయారు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీ సెంటర్లను నిర్వహిస్తున్నామని, ప్రతి సెంటర్లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లతో పాటు ప్రతి మండలానికి కేటాయించిన ఒక 104 వాహనంలో మరో డాక్టర్ ఉంటారని అన్నారు.