Andhra University Alumni Association: దేశాన్ని ఉన్నత స్దితిలో ఉంచేందుకు యువత నిజాయితీగా శ్రమించడం ఒక్కటే మార్గమని, ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. వాళ్లే మార్గదర్శులు అవుతారని, ఇలా శ్రమించిన వారే విదేశాలలో మన దేశానికి నిజమైన రాయబారులుగా ఉన్నారన్నారు. విశాఖలో పూర్వ విద్యార్ధుల సంఘం ఆరో మహా సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై.. యువతకు దిశానిర్దేశం చేశారు.
కెరీర్ను ఎంచుకోవడం, దానిపై అవిశ్రాంతంగా శ్రమించడం, అందులో ఉన్నత స్ధితిని సాధించడం వంటివి తమ లక్ష్యాలుగా నిర్దేశించుకోవాలని సూచించారు. భారత్ గెలిస్తేనే మీరంతా గెలుస్తారని,.. భారత్ గెలవలేకపోతే గెలవలేరన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను కలలు గన్న భారతదేశాన్ని యువత సాధిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వివిధ సందర్బాలలో సవాళ్లను ఎదుర్కొనేందుకు అనుభవాలను ఆయన విద్యార్ధులతో పంచుకున్నారు.
సమావేశంలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డి పూర్వ విద్యార్ధులు, అధ్యాపకులు అడిగిన వివిధ ప్రశ్నలను నారాయణ మూర్తిని అడిగి వన్ టు వన్ పద్దతిలో సమాధానాలు రాబట్టారు. ఇంజినీరింగ్లో అందరూ ఐటి, కంప్యూటర్ వైపు వెళ్తున్నారు. వారికి సరైన మార్గదర్శనం చేయండి అని అడిగిన ప్రశ్నకు.. తాను యువతను తప్పుబట్టలేనన్నారు. వారు కంప్యూటర్ సైన్స్, ఐటీనే ప్రధానంగా ఎన్నుకుంటున్నారంటే గతంలో కంటే మంచి జీవితాన్ని అనుభవించాలన్న వారి తాపత్రయం అర్ధం చేసుకోవాలి.