ఏపీలో వైకాపా ప్రభుత్వ మూర్ఖ వైఖరితో గత రెండు రోజుల్లో రాష్ట్రం నుంచి రూ.17 వేల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రిలయన్స్ తన ప్లాంటు ఏర్పాటును విరమించుకుంటే..ట్రైటాన్ తెలంగాణకు తరలిపోయిందన్నారు. దీంతో ఏపీ నుంచి రూ. 17 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తరలిపోవటంతో పాటు వేలాది ఉద్యోగాలను యువత కోల్పోయిందని మండిపడ్డారు. ఇప్పటికే ప్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ వంటి ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు రాష్ట్రానికి వీడ్కోలు పలికాయన్నారు. 2018లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ. 52 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ నాటి తెదేపా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు.
తిరుపతి సమీపంలో 150 ఎకరాల్లో 17 వేల కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలు స్థాపించేలా అంబానీని ఐటీ మంత్రిగా నేనే ఒప్పించా. జియో ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, ఇతర ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు లభించేలా ఒప్పందం చేసుకున్నాం. భూములు వెనక్కిచ్చి మరీ రిలయన్స్ పరిశ్రమ వెళ్లిపోతుంటే..ఏపీ సర్కారు ఏం చేస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న అమెరికా సంస్థ ట్రైటాన్ తెలంగాణకి తరలిపోవటంపై ఏం సమాధానం చెబుతారు. -లోకేశ్
తప్పుడు జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల్ని ముంచేసిన జగన్...ప్రైవేటు కంపెనీలను తరిమేస్తూ వారికి ఉపాధిని దూరం చేస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జీవో తెచ్చిన జగన్.. తన సొంత బ్రాండ్ ప్రెసిడెంట్ మెడల్ విస్కీ అమ్మే సేల్స్‌మేన్ ఉద్యోగాలిస్తారా ? అని ఎద్దేవా చేశారు.
తరలిపోతున్న వేల కోట్ల పరిశ్రమలు