మేం జగన్ పాదయాత్రను అడ్డుకోలేదు.. అలాంటప్పుడు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు Yuvagalam Padayatra: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చెయ్యడం ఆపి.. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చెయ్యాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రం మళ్లీ గాడిన పడాలంటే.. మరో పదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. 16వ రోజు యువగళం పాదయాత్ర ఎస్‍ఆర్ పురం విడిది కేంద్రం నుంచి ప్రారంభమయ్యింది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదవ సామాజిక వర్గం.. బెంగళూరులో స్ధిరపడిన జీడి నెల్లూరు నియోజకవర్గ వ్యాపారవేత్తలతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్‍ఆర్ పురంలోని హనుమంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా ఎస్ఆర్పురం పుల్లూరు క్రాస్ రోడ్డులో ప్రజలనుద్దేశించి మాట్లడేందుకు సిద్ధమైన లోకేశ్‌ను పోలీసులు అడ్డుకొని మైక్‌ను లాక్కున్నారు.
సమస్యలపై.. పోరాడటానికి ప్రజల్లోకి వచ్చాం: దీంతో లోకేశ్ అక్కడికి వచ్చిన ప్రజల్ని మౌనంగా ఉండమని చెప్పి.. మైక్ లేకుండానే ప్రసగించారు. టీడీపీ హయంలో వైఎస్, జగన్ పాదయాత్రలని ఏనాడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. తాను టెర్రరిస్టుని కాదని.. ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. జగన్ లాగా దేశాన్ని దోచుకొని తాను జైలుకి వెళ్లలేదని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై.. పోరాడటానికి ప్రజల్లోకి వచ్చానని లోకేశ్ స్పష్టం చేశారు.
నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్: ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నియోజకవర్గంలో అభివృద్ధి నిల్.. అవినీతి ఫుల్ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. తన మైక్ లాక్కోవడానికి వస్తున్న 1000 మంది పోలీసులకు.. ఇదే విధంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అడ్డుకోమంటూ హితవు పలికారు. గతంలో ఐఎఎస్‌లను మాత్రమే జైలుకి తీసుకెళ్లిన జగన్.. ఇప్పుడు ఐపీఎస్‌లను సైతం జైలుకి తీసుకుపోతాడని విమర్శించారు. మహిళలు, యువత, రైతులకు జగన్ చేసిన అన్యాయాలపై తన పోరాటం ఆగదన్నారు. వైసీపీ వాళ్లకి అమలు కానీ జీఓ నెం1.. తనకే ఎందుకు అమలు అవుతుందని లోకేశ్ ప్రశ్నించారు.
జగన్ యాదవ సోదరులకు ఇచ్చిన హామీని అమలు చేశాడా..? కార్పొరేషన్ నిధులను ఇచ్చాడా. మా ప్రభుత్వం ఉన్న సమయంలో మేము రూ.300 కోట్లు ఖర్చు చేశాం. జగన్ యవతకు వెన్నుపోటు పొడిచాడు. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు.. ఇచ్చాడా. జగన్ ఇడుపులపాయ పంచాయతీ రాష్ట్రంలో చేస్తున్నారు. ఈ విధానం మారాలంటే మళ్లీ బాబు రావాలి. పది సంవత్సరాలపాటు బాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని పరిస్థితులు మారుతాయి. నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి:'ప్రైవేటీకరణ విషయంలో మోదీకి.. కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారు'
తండ్రికి 44.. కొడుకుకి 133 ఏళ్లు.. అధికారుల నిర్లక్ష్యంతో కూలీ కుటుంబం అవస్థలు