LOKESH YUVAGALAM : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సంసిరెడ్డిపల్లెలో నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మైక్ తీసుకొస్తున్న టీడీపీ కార్యకర్తను అడ్డుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి మైక్ లాక్కున్నారు. లోకేశ్ నిల్చొన్న స్టూల్ కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్టూల్ మీదే నిల్చొని లోకేశ్ నిరసన తెలుపుతున్నారు.
మహదేవపురంలో ఎస్సీలతో మాట్లాడిన లోకేశ్: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపేసే పరిస్థితులున్నాయని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. 14వ రోజూ..యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు ముత్యాలమ్మ గుడిలో పూజలు, గుడ్ షెపర్డ్ చర్చిలో ప్రార్థనలు అనంతరం ఇవాళ్టి యాత్రను ప్రారంభించారు. మహదేవపురంలో బొమ్మలు తయారు చేసే ఎస్సీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు చేయడం తప్ప.. వారి సంక్షేమానికి ప్రత్యేకంగా ఎలాంటి ఖర్చు చేయడం లేదని.. దుయ్యబట్టారు.
సెల్ఫీ విత్ లోకేశ్: అంతకుముందు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రంలో సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముత్యాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న లోకేశ్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు.
పాదయాత్రలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్ధరణ 10 ఏళ్లకు ఒకసారి జరిగేదని.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేయాలన్న నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని లోకేశ్ దృష్టికి తెచ్చారు.