తెలంగాణ

telangana

ETV Bharat / state

'వెండితెర'పైనే కాదు.. రాజకీయాల్లోనూ చెరగని ముద్ర - NTR Welfare schemes

NTR Welfare schemes : వెండితెర నాట అందాల రాముడైనా .. కొంటె కృష్ణుడైనా .. ఏడుకొండల వాడైనా.. ఇలా ఏ పాత్రైనా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. నేడు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 40 ఏళ్లు.

NTR
NTR

By

Published : Jan 9, 2023, 8:10 AM IST

Updated : Jan 9, 2023, 8:24 AM IST

రాజకీయాల్లో తారక రాముడి చెరగని ముద్ర

NTR JOURNEY AS AP CM : నవ రాజకీయానికి తెరతీసిన యోధుడు.. ఆరు కోట్ల ఆంధ్రుల అభినవ రాముడు.. ఓట్ల సునామీ సృష్టించిన.. నవ చరిత్రకారుడు అతనే.. విశ్వవిఖ్యాత నందమూరి తారక రాముడు. ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అనంతరం ఆయన చేసిన సంక్షేమాలు అనంతం.

ప్రజాపాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర

ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రజాపాలనపై చెరగని ముద్ర: ప్రజాబలంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ దిల్లీ పీఠం అప్రజాస్వామిక చర్యలకు, అంతఃపుర కుట్రలకు దిగి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది. కో-పైలెట్ నాదెండ్లను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. తెలుగు నాట ఉప్పెనలా పెల్లుబికిన ప్రజా ఉద్యమం.. ఎన్టీఆర్​ని తిరిగి ముఖ్యమంత్రిని చేసింది. ఈ ఒడిదుడుకులను అధిగమించి ప్రజా పాలనపై ఎన్టీఆర్ తనదైన ముద్రవేశారు. చారిత్రక నిర్ణయాలతో చరితార్ధుడుయ్యారు. ఎన్టీఆర్​ని సంక్షేమ పాలకుడిగా, సాహసవంతుడిగా నిలిపిన కొన్ని పథకాలు, దృఢ నిర్ణయాలనూ ప్రజలందరూ విశ్లేషించుకోవాలి.

కాంగ్రెస్ నీచ రాజకీయంతో​ ఎన్టీఆర్​ ప్రభుత్వం బర్త్​రఫ్:​ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విజయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్.. ఆయన గుండె ఆపరేషన్​కు అమెరికా వెళ్లిన సమయం చూసి నీచ రాజకీయం చేసింది. 1984 ఆగస్టు 15న గవర్నర్ రామ్ లాల్‌ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు. ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ అప్రజాస్వామిక చర్యతో తెలుగు నేల రగిలింది. ప్రజాగ్రహం ప్రజ్వరిల్లింది.

బర్త్​రఫ్​ తర్వాత.. ముఖ్యమంత్రిగా గెలిచి చరిత్ర: ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలతో కర్ణాటకలోని నందీహిల్స్​లో క్యాంపు పెట్టారు. చిట్టచివరకు తన శాసన సభ్యులను రాష్ట్రపతి ఎదుటే పెరేడ్ చేయించటంతో కేంద్రానికి తలవంపులు తప్పలేదు. దిగి రాకనూ తప్పలేదు. బర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రిని తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటం.. అదో చరిత్ర. ఇందిరా గాంధీ హత్యానంతరం.. పెల్లుబికిన సానుభూతి నేపథ్యంలోనూ.. లోక్​సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం 30 సీట్లు గెలిచింది.

లోక్​సభలో ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇది మరో చరిత్ర. రాజకీయ అనిశ్చితి తొలగినా.. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నా.. ఎన్టీఆర్ ధిక్కారము సైతమా? అన్నట్లు తగ్గిన బలంతో తగిన పాలన అందించననే సందేహంలో ఉండిపోయారు. మరింత బలంతో శాసనసభకు రావాలని నిశ్చయించారు.

ప్రజలకు ఆ మూడు ఇవ్వలేని పాలకులు ఎందుకు: 1985లో ధైర్యంతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 2002 సీట్ల అఖండ మెజారిటీతో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తనను వెండితెర మీదనే కాకుండా, రాజకీయ యవనిక మీద తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన ప్రజల రుణం తీర్చుకోవటానికి సిద్ధమయ్యారు. కట్టుబట్టలివ్వాలి. పట్టెడన్నం పెట్టాలి. నిలువ నీడనివ్వాలి. ఈ మూడూ ఇవ్వలేని పాలకులు ఎందుకు అని ఎన్టీఆర్ అనేవారు.

సీఎం కాగానే రెండు రూపాయలకే కిలో బియ్యం: ఆయన అన్నట్లుగానే 1983లో తొలిసారి సీఎం కాగానే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. కోటి 43 లక్షల కుటుంబాలకు సబ్సిడీ బియ్యాన్ని నెలకి 25 కిలోల వంతున పంపిణీ చేశారు. ఏటా 18 లక్షల టన్నుల బియ్యాన్ని అందజేశారు. గంజి కేంద్రాలు వెలసి ఆకలి రాజ్యంలా ఉన్న నాటి రాష్ట్రాన్ని ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన బియ్యం పథకం ఆదుకుంది. ఆకలి మంటలు చల్లార్చింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆహార భద్రత పథకానికి నాడు ఎన్టీఆర్ ప్రభుత్వ సబ్సిడీ బియ్యం పథకం స్ఫూర్తిగా నిలిచింది. తమిళనాడు స్ఫూర్తితో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్​లో మధ్యాహ్న భోజన పథకం తెచ్చారు. 38 లక్షల పేద బాలలకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించారు.

ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి.. అన్నగారు అని పలికించి:'కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ!"అనే పద్యం వల్లె వేస్తూ మహిళల ఆదరణ పొందారు. కేవలం అందుకే కాదు. అన్నదమ్ములకే ఇవ్వకుండా, తండ్రి ఆస్తిలో సోదరులకు వాటా ఉన్నట్లే తమకూ సమానవాటా ఇచ్చినందుకు ఎన్టీ రామారావును తెలుగింటి ఆడపడుచులు, అక్కచెల్లెళ్లు అభిమానంతో 'అన్నగారు' అని పిలిచారు. ఎన్టీఆర్ ఆలోచన, త్రికరణ శుద్ధిగా చేసిన ఆచరణను దేశం స్ఫూర్తిగా భావించింది. కేంద్రం కూడా ఆస్తి హక్కు సవరణ చేసి మహిళలకు అండగా నిలిచింది.

తాలుకా వ్యవస్థను రద్దు చేసి.. నిజమైన పరిపాలనా వికేంద్రీకరణకు నాంది: నిజమైన పరిపాలనా వికేంద్రీకరణకు, అభివృద్ధికి ఎన్టీఆర్ తన హయాంలో నాంది పలికారు. తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల ప్రజాపరిషత్​లను తీసుకొచ్చారు. జడ్పీ ఛైర్మన్లు, మండల పరిషత్ ఛైర్మన్లు, సర్పంచులు, కార్పొరేషన్ మేయర్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు.

గడీల పాలన పోయినా.. ఘడియ ఘడియకు భయంగానే బతకాలా? బలహీన వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులైనా కూడా.. నీ బాంచెన్ దొరా? అనాలా? అని కుమిలిపోతున్న సమయంలో.. రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్.. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని భావించారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను రద్దు చేసి అభయమిచ్చారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులు తమ అధికారాలను తామే చెలాయించే స్వేచ్ఛ నిచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమని ప్రశంసలు వచ్చాయి.

బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్​ దే: రాష్ట్రంలో బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్​కే దక్కింది. బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన చేపట్టిన పాలన సంస్కరణలు తర్వాత రోజుల్లో దేశానికే ఆదర్శమైనాయి. 1987లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, మహిళలకు 9 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

అప్పటిదాకా 14 శాతంగా ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం, 4 శాతంగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారు. తర్వాత స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. టీడీపీ హయాంలో వెనుకబడిన సామాజిక వర్గాలు రాజకీయంగా ఎదిగాయి. ఇదే స్ఫూర్తితో కేంద్రం 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్​ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది.

విద్యార్థుల భవితకు బాటలు వేసేందుకు ఎంసెట్​: ఎన్టీ రామారావు విద్యారంగంలో ఎన్నో అద్భుత సంస్కరణలు తీసుకొచ్చారు. దూడపెయ్యలు అమ్మితే ఒక రైతు తన బిడ్డను మెడిసిన్ చదివించగలడా? భార్య నగలు బ్యాంకులో పెట్టి కుమార్తెకు ఇంజనీరింగ్ చేయించగలడా? తెలుగు నాట అప్పట్లో డొనేషన్ల దోపిడీ ప్రతిభావంతులైన విద్యార్ధుల నైతిక స్థైర్యాన్ని, అవకాశాలను దెబ్బతీసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ఎన్టీరామారావు 1986లో రాష్ట్రమంతా వర్తించే విధంగా మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ (EAMCET) పరీక్షా విధానం తీసుకొచ్చారు. విద్యార్థులకు గొప్ప మేలు చేశారు.

నాలెడ్జ్​ హబ్​గా రాష్ట్రం రూపాంతరం: ఎన్టీఆర్ 1983 ఎన్నికల్లో 120 మంది గ్రాడ్యుయేట్లకు, 28మంది పోస్టుగ్రాడ్యుయేట్లు టిక్కెట్లిచ్చారు. ఆయన టిక్కెట్లిచ్చిన వారిలో డాక్టర్ల సంఖ్య 20 కాగా, ఎనిమిది మంది లాయర్లు 47 మంది ఇంజనీర్లు ఉన్నారు. గురుకుల విద్యావ్యవస్థను అభివృద్ధి చేశారు ఎన్టీఆర్. రెండు గురుకులాల నుంచి 220 గురుకులాలు ఏర్పాడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నాలెడ్జి హబ్​గా రూపొందటానికి ఈ గురుకుల కళశాలలే బీజం వేశాయి.

తొలి వైస్​ ఛాన్సలర్​ సలహాలతో ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం: నాలుగొందల రూపాయల టీచర్లా అని పరిహాసమాడేవారు. కానీ ఎన్టీఆర్ హయాంలో 1984లో నియామకం పొందిన స్పెషల్ టీచర్లు ఒక పెద్ద సంచలనం. తొలుత తక్కువ వేతనంతో చేరిన వీరంతా కొద్ది కాలంలోనే శాశ్వత ఉద్యోగులై లబ్ధి పొందారు. తారకరాముణ్ణైనా, తారక మంత్రోపదేశం అయినా తక్కువగా చూడొద్దని యువత అర్థం చేసుకుంది. పద్మావతి విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ వనజా అయ్యంగార్ సలహాలతో.. ప్రత్యేక ఉపాధ్యాయులను ఎన్టీఆర్​ నియమించారు.

ఉన్నత విద్యలో ప్రవేశానికి 50 శాతం సీట్లను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. మిగిలిన 50 శాతం మేనేజిమెంట్ కోటాగా చేసి ఫీజు నిర్ణయించిది. మండల స్థాయిలో 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

తథాగతుని విగ్రహ ప్రతిష్ఠాపనతో బౌద్ధ పర్యాటకాభివృద్ధికి నాంది: "ఈ సంఘం.. నీ ధర్మం.. దానిని నువు మరువద్దు. జాతిని నడిపి, నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు".. ఎన్టీఆర్ సొంతగా నిర్మించి, నటించిన బ్లాక్​బస్టర్ సినిమా కోడలు దిద్దిన కాపురం ఈ పాటను రాజకీయ యావనిక మీదికీ వచ్చినా మరచిపోలేదు. హైదరాబాద్ ట్యాంక్​బండ్ మీద తెలుగు వెలుగు మూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. హుస్సేన్​సాగర్​లో ఎత్తయిన తథాగతుని విగ్రహ ప్రతిష్ఠాపనతో బౌద్ధ పర్యాటకాభివృద్ధికి నాంది పలికారు. సారానిషేధం నినాదాన్ని ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, సారా నిషేధం విధించారు. ప్రజల మద్దతు పొందారు.

ఆసియాలో మహాత్మాగాంధీ బస్​స్టేషన్​ నిర్మాణం: ఎన్టీఆర్ హయాంలో విశాఖ ఉక్కు ఉత్పత్తి ప్రారంభించింది. ఆయన నిరంతర ప్రయత్నాలతో ఆంధ్రుల హక్కు నిజమైంది. భాగ్యనగరంలో మతకలహాలను నిరోధించారు. ప్రశాంత జీవనానికి బాట వేశారు. ఎన్టీఆర్‌ తన హయాంలో ఆర్టీసీ మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అతిపెద్ద బస్సు స్టేషన్​గా మహాత్మాగాంధీ బస్ స్టేషన్​కు నిర్మాణం చేపట్టారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి సహా అనేక అధునాతన బస్​స్టేషన్లు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి.

విశ్వస్థాయి వైద్య విజ్ఞాన సంస్థగా నిమ్స్​: ఎన్టీఆర్ ప్రభుత్వం హైదరాబాద్​లో నిజాం ఆర్థో పెడిక్ ఆస్పత్రిని నిజామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) గా తీర్చిదిద్దింది. సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారింది. అమెరికాలో ప్రసిద్ధ రేడియాలజిస్టు డాక్టర్​.కాకర్ల సుబ్బారావును డైరెక్టరుగా నియమించారు. ప్రభుత్వ రంగంలో నిమ్స్ విశ్వస్థాయి వైద్య విజ్ఞాన సంస్థగా ఆవిర్భవించింది. విదేశాల నుంచి వైద్యులను, వృత్తి నిపుణులను ఆహ్వానించి విద్యా, వైజ్ఞానిక సంస్థలకు డైరెక్టర్లు, అధిపతులుగా నియమించిన ఖ్యాతి ఎన్టీఆర్​ది. 1991లో దిల్లీ గద్దె మీద ఎక్కే అవకాశం తెలుగు పెద్దకు వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు నంద్యాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన.. పీవీ నరసింహారావుకు పూర్తి మద్దతు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులకు నాంది: తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారు. చెన్నై దాహం తీర్చే పైప్ లైన్ పథకాన్ని రూపు మార్చి కాల్వలు తవ్వించారు. రాయలసీమను సస్యశ్యామలం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టారు. తెలుగు గంగ, హంద్రీనీవా, నెట్టెంపాడు, శ్రీరామ్​సాగర్ బ్రాంచ్ కాలువలు.. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. మద్రాసీలుగా పేరు పడిన ఆంధ్రులను తెలుగు వారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆత్మగౌరవం కలిగిన ఆంధ్రులుగా పరిచయం చేశారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక, సమున్నత పతాక ఎన్టీఆర్.

బలహీన వర్గాల బానిస సంకెళ్లను తెంపి, వారి చేతికి అధికార కరవాలం అందించిన సమసమాజవాది ఎన్టీఆర్ అని రాజకీయ విమర్శకులు ప్రస్తుతించారు.

Last Updated : Jan 9, 2023, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details