బసవతారకం ఇండో అమెరికన్ (Basavatharakam Indo American hospital) ఆస్పత్రి నిస్వార్థ సేవలను నీతి ఆయోగ్ గుర్తించటం పట్ల ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హర్షం వ్యక్తం చేశారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని (National Doctor's Day) పురస్కరించుకుని బసవతారకం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రత్యేకంగా తయారు చేయించిన కేక్ కట్ చేసి వైద్యులతో పంచుకున్న బాలయ్య... ఆస్పత్రిలో ఎనలేని సేవలు చేస్తున్న వైద్యులను సత్కరించారు. నిరుపేదలకు బసవతారకం ఆస్పత్రి ద్వారా సేవ చేయటం సంతృప్తినిస్తోందని బాలయ్య అన్నారు. కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి మరీ డాక్టర్లు సేవ చేస్తున్నారంటూ కితాబిచ్చారు.
అన్ని వృత్తుల్లోకెల్లా ఉన్నతమైన వృత్తి డాక్టర్ వృత్తి. ఎదుటి వ్యక్తికి ప్రాణం పోయడం కంటే ఈ జీవితానికి వేరే సాఫల్యం లేదు. ఎంతో మందికి ప్రాణదానం చేస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న వైద్యులందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ అంటుంటారు డాక్టర్ కావాల్సిన వాడ్ని యాక్టర్ అయ్యానని.. కానీ నాది యదార్థం. నాన్నగారికి నన్ను డాక్టర్ను చేయాలని ఉండేది. ఆయన కోరిక మేరకు డాక్టర్ను కాకపోయినా ఆస్పత్రికి ఛైర్మన్ అయ్యా. నీతి ఆయోగ్ మన ఆస్పత్రిని గుర్తించడం మన అదృష్టం. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ అవార్డుల కోసమో... రివార్డుల కోసం పనిచేయట్లేదు. అవి వచ్చినప్పుడు కాదనగలమా. లాభపేక్ష లేకుండా ఉన్నత ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నాం.