MLAs Poaching Case Update: దిల్లీ స్థాయిలో పరిచయాలున్నాయనీ.. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానంటూ గల్లీ నేతలతో బేరసారాలు.. ఏ పని కావాలన్నా చేసిపెడతానంటూ పలువురికి ఆశలు.. ఇవీ నందకుమార్ లీలలు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా సోమవారం నందకుమార్ సతీమణి చిత్రలేఖ, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌ను బంజారాహిల్స్ పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సిట్ వేర్వేరుగా విచారించింది.
శుక్రవారం మొదటిసారి విచారణకు వచ్చిన చిత్రలేఖ.. సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండోసారి న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. తొలుత మౌనం వహించినా తర్వాత సిట్ అధికారుల ప్రశ్నలకు తొణక్కుండా జవాబులిచ్చారని సమాచారం. గతంలో పలుమార్లు సింహయాజి, రామచంద్రభారతి తమ నివాసానికి వచ్చారని ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరితోపాటు దిల్లీ నుంచి ఎవరైనా వచ్చారా అన్న ప్రశ్నకు గుర్తులేదంటూ సమాధానం దాటవేశారని తెలిసింది.
కొన్ని సెల్‌ఫోన్లు పాడయ్యాయని.. మరికొన్ని కనిపించటం లేదంటూ చెప్పారు. నందకుమార్ తన వ్యాపార కార్యకలాపాలు, ప్రైవేటు పంచాయితీల లావాదేవీల ఛాటింగ్‌తో ఫొటోల స్క్రీన్‌షాట్‌లను తన భార్య వాట్సప్ నంబర్‌కు షేర్ చేసేవాడు. వాటి గురించి చిత్రలేఖను సిట్ అధికారులు ఆరా తీశారు. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామంటూ ఎవరెవరికి హామీలిచ్చారనే అంశంపై ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన విచారణలో ఆమె చెప్పిన వివరాలను నమోదు చేశారు.