Nampally high Court rejects Ramachandra Bharti's bail cancellation: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి బెయిల్ రద్దుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఫోర్జరీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు కలిగి ఉన్నారన్న కేసులో రామచంద్ర భారతి బెయిల్ రద్దు చేయాలన్న బంజారాహిల్స్ పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డును దుర్వినియోగం చేశారంటూ రామచంద్రభారతిపై బంజారాహిల్స్ పోలీసులు గతంలో వివిధ చట్టాలపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో రామచంద్ర భారతి విడుదల కాగానే జైలు వద్దనే బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. రామచంద్ర భారతికి న్యాయస్థానం అదేరోజు వెంటనే బెయిల్ ఇచ్చింది.
బెయిల్ రద్దు చేయాలని డిసెంబరు 15న బంజారాహిల్స్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టు వాదనలు విని తీర్పు వెల్లడించింది. రామచంద్ర భారతి తరఫు న్యాయవాది రామారావు ఇమ్మానేని వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ రద్దు చేయడానికి తగిన కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.