ఓటుకు నోటు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(enforcement directorate) దాఖలు చేసిన అభియోగపత్రాన్ని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు(Nampally Metropolitan Sessions Judge Court) విచారణకు స్వీకరించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సమన్లు జారీ చేసింది. బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేంతో పాటు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
కుట్ర జరిగిందన్న ఈడీ..
అక్టోబరు 4న హాజరు కావాలని ఈడీ కేసులను విచారణ జరిపే నాంపల్లి మెట్రో పాలిటన్సెషన్సు కోర్టు ఆదేశించింది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కుట్ర జరిగినట్లు ఈడీ(ED) వెల్లడించింది. తెలంగాణ ఏసీబీ (TELANGANA ACB) దాఖలు చేసిన ఛార్జీషీట్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.