Delhi Liquor Scam Case: ఒక్క కేసు వందకుపైగా ఖాతాల ప్రవాహాన్ని పట్టించింది. వాటిమాటున దాగిన బినామీ వ్యక్తులు, వారి వెనుక ఉన్న పెద్దల బండారాన్ని బట్టబయలు చేయబోతోంది. ఎక్కడో దిల్లీలో మొదలైన.. మద్యం కేసు ఇప్పుడు అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మెడకు చుట్టుకోబోతోందని.. ఇందులో అనేకమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు: మద్యంకేసులతో సంబంధం ఉన్న వారు కొద్దిమందే అయినా ఇతరత్రా వ్యాపారకార్యకలాపాలు, అనధికారిక పెట్టుబడి, నల్లధనాన్ని చట్టబద్ధంచేసే యత్నానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారానికి సంబంధించి తెలుగురాష్ట్రాల్లో ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు సోదాలు నిర్వహించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఆ కేసులో సీబీఐ నిందితునిగా చేర్చడంతో అయనతో కలిసి వ్యాపారాలుచేస్తున్న వారిపైనా దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టాయి.
రామచంద్రపిళ్లై కార్యాలయం సోదాలు:అందులోభాగంగా తొలుత రామచంద్రపిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. ఆనంతరం ఆయనతో వివిధ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్, ప్రేమసాగర్ గండ్ర తదితరులపై దృష్టి సారించింది. వాస్తవానికి అంతటితో ఈడీ దర్యాప్తు పూర్తవుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా మద్యం ముడుపులకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి దోమల్‌గూడకు చెందిన గోరంట్ల అసోసియేట్స్ సంస్థ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.