Telangana ST Reservation Bill in Parliament: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన తర్వాతకూడా దేశంలో ఎస్సీ, ఎస్టీలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పడానికి బదులు ఆ సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలంటే.. తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని, ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం లోక్‌సభలో ఎస్టీ ఆర్డర్ అమెండ్‌మెంట్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి 2017లో కేంద్రానికి పంపాం. దీన్ని ఆమోదించాలని కోరుతూ మా ముఖ్యమంత్రి కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. పార్లమెంటులోనూ ప్రస్తావించాం.
కేంద్రం ఎస్టీ బంధు పథకం తీసుకురావాలి: ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోండి. లేదంటే తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల గురించి కేంద్రం ఇసుమంతైనా ఆలోచించడంలేదని భావించాల్సి వస్తుంది. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని కోరుతూ 2014లో అసెంబ్లీలో తీర్మానం ప్రస్తుతం రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టాలి. మేం తెలంగాణలో కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టాం. మేం దళితబంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఉచితంగా ఇస్తున్నాం. అదే తరహాలో కేంద్రం ఎస్టీ బంధు పథకం అమలుచేయాలి. అటవీభూముల్లో వ్యవసాయం చేసుకొనే ఎస్టీలకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా చట్ట సవరణ చేయాలి’’ అని నామా డిమాండ్ చేశారు.