Road collapsed at Goshamahal : హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలోని చాక్నవాడి మార్కెట్ ఒక్కసారిగా భీతిల్లింది. శుక్రవారం మార్కెట్ వీధిలో రోడ్డు పక్కన వ్యాపారుల కూరగాయలు, ఇతర వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడే నిల్చున్న కొందరు అందులో పడిపోవటంతో.. స్వల్ప గాయాలయ్యాయి. మార్కెట్లో విక్రయాలకు తెచ్చిన కూరగాయలు అందులో పడిపోయాయి. రోడ్డు కుంగిపోవటంతో భారీ గొయ్యి ఏర్పడటంతో పక్కనే ఉన్న వాహనాలు అందులో పడి.. దెబ్బతిన్నాయి. రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటం.. వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెను ప్రమాదమే తప్పింది.
రోడ్డు కుంగిన చోటకాకుండా మరికొంత దూరంలో నాలా ఉంది. పెద్ద వర్షాలు వచ్చినప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని.. ఉన్నట్లుండి రోడ్డు కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు.. రోడ్డు కుంగిపోవటానికి గల కారణాలను పరిశీలించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం.. అక్కడకి చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షించారు. నాలా ఆక్రమణలకు గురి కావడంతోనే.. ప్రమాదం జరిగిందని మంత్రి తలసాని తెలిపారు.
"ఇది అఫ్ఘల్సాగర్ ప్రధానమైన కాలువ. ఇటువంటి ప్రమాదం జరిగిన ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమీ కాకపోవడం అందరం ఊపిరి పీల్చుకోవలసిన విషయం. నాలా ఆక్రమణలకు గురికావడమే ప్రమాదానికి ప్రధాన కారణం. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది." - తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి