తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నాగుల చవితి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు - Nagula Chavithi latest news

Nagula Chavithi Celebrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా నాగుల చవితి వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తి నైవేద్యాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. పుట్టల్లో పాలు పోస్తూ.. కోడిగుడ్లు సమర్పించారు. జాతక దోష నివారణ, పెళ్లి కాని వారు, సంతానం లేని వారి కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Nagula Chavithi celebrations  all over the state
Nagula Chavithi celebrations all over the state

By

Published : Oct 29, 2022, 9:54 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు

Nagula Chavithi Celebrations in Telangana: నాగుల చవితి సందర్భంగా రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని గణేశ్​ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్ప సంస్కార హోమం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. పాలు, పండ్లతో నాగరాజుకి నైవేద్యాలు సమర్పించారు. జాతకంలో దోషాలు తొలగించుకోవడానికి, సంతాన యోగానికి హోమం నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు పురుషోత్తమాచార్యులు తెలిపారు.

హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరకాల పట్టణంలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్​లో పుట్ట వద్దకు అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి పాలు పోస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. కార్తీకమాస ఉత్సవం సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో లక్ష్మీనరసింహస్వామి గుట్టపైన భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తూ.. పాలు, కోడిగుడ్లు సమర్పించారు. మహిళలు, పురుషులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బారులు తీరిన భక్తులు:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పెళ్లి కావలసిన అమ్మాయిలు, సంతానం కోసం ఎదురుచూస్తున్న జంటలు నాగమయ్య దేవాలయాలకు బారులు తీరారు. ఉదయం నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పిల్లా పాపలతో కలిసి వచ్చి నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేస్తూ.. పండ్లు, కొబ్బరి కాయలు, వడపప్పు, చలివిడి ముద్దలను నైవేద్యంగా సమర్పించారు. దేవాలయాలలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు: హుజూర్‌నగర్‌లో వేకువజాము నుంచే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసిన మహిళలు.. స్వామివారి పుట్ట దగ్గర 365 దీపాలు వెలిగించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంతానం లేని వారు పూజలు చేయడం వలన సంతానం కలుగుతుందని విశ్వసిస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, రామకృష్ణాపూర్ పట్టణాల్లో నాగుల చవితి వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయాల్లోని పాముల పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగేంద్రుని విగ్రహం వద్ద, పుట్టలో పాలు పోసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చదవండి:తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు..

సాయినాథుడికి 15 తులాల బంగారు హారాన్ని బహుకరించిన ఐఏఎస్​ భార్య

ABOUT THE AUTHOR

...view details