KTR Comments at Nagole flyover Inauguration: నగర విస్తరణకు అనుకూలంగా అభివృద్ధి పనులు చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఎలా విస్తరిస్తుందో సోషల్ మీడియాలో చూస్తున్నామని పేర్కొన్నారు. నగర అభివృద్ధి పనులు చేసుకోకపోతే బెంగళూరు పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని కేటీఆర్ అన్నారు. వరల్డ్ గ్రీన్‌సిటీగా హైదరాబాద్‌కు అవార్డు రావడం గర్వకారణంగా ఉందన్నారు. రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు చేద్దామని కేటీఆర్ పేర్కొన్నారు.
'ఎల్బీనగర్ - ఉప్పల్ పరిధిలో 17 ప్రాజెక్టులు చేపట్టాం. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఆరేళ్ల కిందట ఎల్బీనగర్ చౌరస్తా గందరగోళంగా ఉండేది. ఎల్బీనగర్‌లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. రూ.143 కోట్లతో నాగోల్ ప్లైఓవర్ నిర్మాణం చేశాం. వచ్చే ఏడాది మార్చిలోగా మరో నాలుగు ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఎల్బీనగర్‌లో రహదారుల అభివృద్ధికి రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్నాం. ఎల్బీనగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్యను నాలుగు రోజుల్లో పరిష్కరిస్తాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి నగరంలోని ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఆర్‌డీపీ ప్రోగ్రాంను 2015లో ఆమోదించారని కేటీఆర్ అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ పేరుతో తీసుకున్న ఈ కార్యక్రమంలో మొదటి దశలో రూ.8,052.92 కోట్లతో 47 వివిధ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. వాటిలో ఒక్క ఎల్బీనగర్- ఉప్పల్ ప్రాంతంలోనే 17 ప్రాజెక్టులను తీసుకున్నామన్నారు. మొత్తం 47 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 32 పూర్తి చేశామన్న కేటీఆర్.. అందులో 16 ఫ్లైఓవర్లు, 5 అండర్‌పాస్‌లు, 7 రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు, ఒక కేబుల్ బ్రిడ్జ్.. ఇలా మొత్తం 32 ప్రాజెక్టులను పూర్తి చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మధ్య నగరంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాలాలను బాగు చేయాలనే ఉద్దేశంతో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా రూ.113 కోట్లతో చేపట్టిన 11 వివిధ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు.