Nagoba Fair Started Today: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. మెస్రం వంశస్థులు నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. ఈ నెల 17న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశస్థులు.. ఆ చెట్ల నీడలో గంగాజలంతో మూడురోజుల పాటు వివిధ సంప్రదాయ పూజలు చేశారు.
శనివారం ఉదయం అక్కడి నుంచి వెండి విగ్రహం, పూజా సామగ్రిని తీసుకొని డోలు, కాలికోమ్ వాయిద్యాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకున్నారు. గంగాజలంతో ఆలయాన్ని శుభ్రపరిచి, నాగోబాకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా డోలు, కిక్రీ వాయిద్యాలతో ఆలయం మార్మోగింది. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలతోపాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల్లోని ఆదివాసీలు తరలివచ్చారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, పటేల్ మెస్రం బాదిరావు, పూజారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ నెల 28 వరకూ జాతర కొనసాగనుంది.
Nagoba jatara 2023: నాగోబా వ్రతం ఆచరిస్తున్న మెస్రం వంశీయులు కాలినడకన 15 రోజుల పాటు ప్రయాణించి, గోదావరి నది నుంచి మట్టి కుండల్లో నీళ్లు తెస్తారు. ఆ నీటిని పవిత్ర గంగాజలంగా భావిస్తారు. ప్రయాణ బడలిక తీరేందుకు కేస్లాపూర్ సమీపంలో మర్రిచెట్టు కింద సేదతీరుతారు. తుడుంమోతలు, సన్నాయి వాయిద్యాల మోగిస్తూ.. అర్ధరాత్రి నాగోబా దేవతను అభిషేకం చేయడంతో మహాక్రతువు ప్రారంభం కానుంది.