దేశంలో భవిష్యత్తు వ్యవసాయం అంతా అద్భుతంగా ఉండబోతోందని నాబార్డ్ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. రష్యా, చైనా అనుభవాల నేపథ్యంలో రాబోయే పదేళ్ల కాలంలో భారత్‌లో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారానే వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఉత్పాదకత, నాణ్యత పెంపు, నిల్వ, ప్రొసెసింగ్, విదేశాలకు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
సరికొత్త స్కీములతో...
దేశవ్యాప్తంగా పది వేల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు 4 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని గోవిందరాజులు తెలిపారు. అందుకోసం క్రెడిట్ గ్యారంటీ స్కీం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సహకార రంగం బలోపేతం, రైతులకు మరిన్ని సేవలందించేందుకు నాబార్డ్ ప్రయత్నిస్తోందని వివరించారు. దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సహకార సంఘాల్లో పాలన, పారదర్శకత కోసం కంప్యూటీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సొసైటీ వ్యాపార అవకాశాలు పెంపునకు కృషి చేస్తున్నామని చెప్పారు.