కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) రూ.4,600 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రతిపాదనల పరిశీలన పూర్తయిందని, త్వరలోనే రుణం మంజూరు చేస్తూ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పునరాకృతిలో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద రిజర్వాయర్ ఇదే. అత్యధిక ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం, దిగువన ఉన్న రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయడంలో మల్లన్నసాగర్ కీలకం కానుంది.
రూ.7,400 కోట్ల అంచనా వ్యయం
రిజర్వాయర్ నిర్మాణ పనులను రూ.7,400 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం గుత్తేదారులకు అప్పగించింది. భూసేకరణ, పునరావాసం ఖర్చు దీనికి అదనం. ఈ రిజర్వాయర్‌కు 17 వేల ఎకరాల భూమి అవసరం. అందులో 3 వేల ఎకరాలు అటవీభూమి కాగా మిగిలింది పట్టాభూమి. ప్రస్తుతం రిజర్వాయర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గుత్తేదారులకు ఇప్పటివరకు రూ.1700 కోట్ల బిల్లులు చెల్లించగా, మరో రూ.1600 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పనులపై నిధుల ప్రభావం పడకుండా ఉండేందుకు నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.