భాగ్యనగరంలో 7వ 'డెక్కన్ హాట్-2021' పేరిట జాతీయ స్థాయి ప్రదర్శన సందడిగా సాగుతోంది. సికింద్రాబాద్‌లోని సింధీ కాలనీ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం భవన్‌లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఆరు రోజులపాటు జరగనున్న ఈ సంతను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి స్వయం సహాయ బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు.
ఔట్‌లెట్ల ద్వారా మార్కెటింగ్..
దాదాపు 50 పైగా స్టాళ్లల్లో సేంద్రీయ, ప్రకృతి, గో-ఆధారిత విధానాల్లో పండించిన వ్యవసాయోత్పత్తులు, దేశీవాళీ వరి బియ్యం, చిరుధాన్యాలు, బిస్కట్లు, ఇతర పిండి వంటలు, సేంద్రీయ బెల్లం, రుచికరమైన పచ్చళ్లు, సుగంధ ద్రవ్యాలు, చేనేత వస్త్రాలు, ఔషధ ఉత్పత్తులు, గానుగనూనెలు, గాజులు, బొమ్మలు, ఆయుర్వేద ఉత్పత్తులు, జ్యూట్ బ్యాగులు, రెడీమేడ్ దుస్తులు, ఇతర చేతి వృత్తుల కళాకృతులు ప్రదర్శిస్తున్నారు. గుంటూరు జిల్లాలో రైతులు బృందంగా ఏర్పడి సేంద్రీయ పాలు, చిరుధాన్యాలు, బ్లాక్ రైస్, నవారా దేశీవాళీ బియ్యం, బెల్లం, ఇతర నిత్యావసర వస్తువులు ఉత్పతి చేసి సొంతంగా ఔట్‌లెట్ల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామని రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తెలిపారు.
విభిన్న రంగాల్లో దూసుకెళ్తూ..
నాబార్డ్ ఆర్థిక సాయంతో గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు విభిన్న రంగాల్లో దూసుకుపోతున్నాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ, వంటకాలు, గాజులు, బ్యాగులు, రెడీమేడ్ దుస్తులు, అందమైన డిజైన్లతో కూడిన అలంకరణ సామగ్రి తయారు చేస్తూ వ్యాపార, మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆర్థిక స్వావలంభన సాధిస్తున్నారు. తాము ఉపాధి పొందుతూ పదిమంది మహిళలకు సైతం ఉపాధి కల్పిస్తున్నారు. పాల్వంచకు చెందిన ఓ సంఘం తాటి ఆకులతో తయారు చేసిన ఆకర్షణీయమైన బ్యాగులు, వివిధ ఆకృతుల్లో నమూనాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం శివారు రఘునాథపాలెంకు చెందిన ఓ మహిళ... సొంతంగా పచ్చళ్ళు, పొడులు తయారు చేసిన ఏకంగా విదేశాలకు సైతం పంపుతూ స్వయం ఉపాధి పొందుతోంది. మెదక్‌కు చెందిన ఓ ఎస్‌హెచ్‌సీ బృందం నేతృత్వంలో మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తుంది.