జమ్ముకశ్మీర్‌లో జూన్ 12న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో అనంతనాగ్‌లోని సర్దార్ పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అర్షద్ ఖాన్ ఒకరు. అర్షద్ దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.
నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...! - నాన్న ఇక లేడని.. ఎప్పటికీ రాడనీ...!
ముద్దులతో గారాలు చేసే నాన్న ఎందుకు పడుకున్నాడో తెలియదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. ఎప్పుడూ చాక్లెట్లు ఇచ్చే నాన్న స్నేహితులు పూలెందుకు తెచ్చారో..! ఇదీ తన తండ్రి వీరమరణం పొందాడని తెలియని ఓ చిన్నారి తీరు. ఆ పసివాడి ప్రవర్తన అందరినీ కంటతడి పెట్టించింది. ఉద్వేగం ఆపుకోలేకపోయిన ఓ అధికారి అతణ్ని పక్కకు తీసుకెళుతూ కన్నీటి పర్యంతమవటం హృదయాలను కలచివేస్తోంది.
కన్నీటి నివాళి..
అర్షద్ మృతదేహాన్ని సోమవారం శ్రీనగర్‌కు తరలించారు. అక్కడ గవర్నర్‌తోపాటు పలువురు సైనికాధికారులు, పోలీసు అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అర్షద్ ఖాన్ నాలుగేళ్ల కుమారుణ్ని ఎత్తుకొని పోలీసు ఉన్నతాధికారి హసీబ్ మొఘల్ నివాళి అర్పింపజేశారు. ఈ క్రమంలో ఆ చిన్నారిని చూసి ఉద్వేగం ఆపుకోలేక పోయిన హసీబ్ అతణ్ని పక్కకు తీసుకెళుతూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మనసుల్ని ద్రవిపజేస్తోంది .
ఇదీ చదవండీ: పాసింగ్ అవుట్ పరేడ్‌లో అదరగొట్టిన విన్యాసాలు