వింతవ్యాధి కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు వరుసగా అస్వస్థతకు గురవుతుండటం కలకలం రేపుతోంది. గతంలో ఏలూరు, పూళ్ల, ఇప్పుడు కొమరేపల్లిలో వరుస ఘటనలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఏలూరు కాలువ పరీవాహక గ్రామాల్లోనే వింతవ్యాధి ప్రబలుతుండటంపై ఏపీ అధికారులు దృష్టి సారించారు.
జిల్లాలో మరోసారి బయటపడ్డ వింతవ్యాధి... ఏపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించింది. దెందులూరు మండలం కొమరేపల్లిలో నిన్న ఉదయం నుంచి 25మంది వింతవ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి, గుండగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారికి చికిత్స అందించారు. కొమరేపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. పది మంది వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఏపీ వైద్యారోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలు సంయుక్తంగా ఈ పరిస్థితికి గల కారణాలను గుర్తించడంలో నిమగ్నమయ్యాయి. గ్రామంలో తాగునీరు, ఆహారం, కూరగాయలు, స్థానికుల రక్త నమూనాలు సేకరించారు.