YCP MLA Raghurami Reddy had a bitter experience: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం మండలం నర్శిరెడ్డిపల్లెలో ఆయనకు వింత అనుభవం ఎదురైంది. గ్రామానికి వెళ్లే దారి ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోకపోవడంతో గ్రామస్థులు.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు చాలాసార్లు మొర పెట్టుకున్నారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు. ఈ క్రమంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం ఎమ్మెల్యే తమ గ్రామానికి విచ్చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని.. తమ ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లోకి వెళ్లిపోయారు.
ప్రభుత్వం ద్వారా గ్రామంలో లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సైతం తొలగించి నిరసన తెలిపారు. యథావిథిగానే 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమ నిర్వహణకు నర్శిరెడ్డిపల్లె గ్రామానికి పార్టీ నాయకులతో, ప్రజాప్రతినిధులతో చేరుకున్న ఎమ్మెల్యేకు ఒక వ్యక్తి మాత్రమే దర్శనమిచ్చారు. జనం లేకుండా బోసిపోయి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారణమేమిటని ఆ ఒక్కగానొక్క వ్యక్తిని అడగడంతో.. ఏళ్ల తరబడి గ్రామానికి ఉన్న 650 మీటర్ల మట్టి రోడ్డును బాగు చేయలేకపోయారని, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో గ్రామస్తులందరూ వారి వారి ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లోకి వెళ్లిపోయారని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన మందిమార్బలంతో అక్కడినుంచి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.