In laws Issues : జ. మీరు మీ అత్తగారు మారాలనుకునే దానికంటే పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు ఏవిధంగా మార్చుకోగలరో ఆలోచించండి. అదేవిధంగా మీ భర్తతో ఐదేళ్లుగా ఎలా అన్యోన్యంగా ఉంటున్నారో దానిని కొనసాగించండి. మీ అత్తగారిని మార్చడం కష్టంతో కూడుకున్న అంశం. ఎందుకంటే, ఆవిడ ఇంతకాలం తనదైన పద్ధతిలో, అభిప్రాయాలతో జీవించారు. ఈ క్రమంలో ఏర్పడిన ఆలోచనలను ఒక్కసారిగా మార్చడం కష్టం. అలాగే ఇప్పుడిప్పుడే మీ దగ్గరకు వస్తున్నా ఆమెకు ఇది ఇష్టం లేని పెళ్లి. కాబట్టి, ఎప్పటికీ కష్టంగానే ఉండే అవకాశం ఉంది.
ప్రేమ వివాహమైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లైనా సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. అయితే మీ విషయంలో మీ అత్తగారి రూపంలో ఆ కష్టం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయితే మీరు ఐదేళ్లుగా సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడే సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. ఒకవేళ మీ పెళ్లిని మొదట్లోనే అంగీకరిస్తే ఈ సమస్య మొదటి సంవత్సరంలోనే వచ్చుండేదేమో. వాళ్లు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు. కాబట్టి, మీకు ఆ సమస్య రాలేదు. ఇలాంటి సమస్యలు కొంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి, మీరు సహనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ల మీ దాంపత్యం అన్యోన్యంగా ఉందంటున్నారు. కాబట్టి, మీ అత్తగారు ఎంత నూరిపోసినా మీ భర్త మీవైపు నుంచే ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆవిడ మీ భర్త మనసుని ఎక్కడ మార్చేస్తారేమోనని ఆందోళన చెందకండి. మీ భర్తతో ఇంతకుముందులా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.