హైదరాబాద్‌లోని ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. గత నెల 22వ తేదీన చేపల మార్కెట్ పరిసరాల్లో 99 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి గుంతలు తవ్వారు. ఆ పనులు నత్తనడకన సాగుతుండటంతో... ఇటీవల కురిసిన వర్షం కారణంగా మురికి నీరు, మార్కెట్లోని చెత్తంతా ఆ గుంతల్లో చేరింది. అలాగే చేపలు శుభ్రం చేయగా వచ్చిన వ్యర్థాలు కూడా అవే గుంతల్లోకి వెళ్తున్నాయి. అలాగే రోడ్డు కోసం తవ్విన గుంతల కారణంగా డ్రైనేజీ పైపులు, మురుగు నీటి పైపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మార్కెట్లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీరుతో మార్కెట్ అంతా దుర్వాసన వస్తోంది.
Musheerabad fishmarket: మురికి కూపంగా మారిన చేపల మార్కెట్.. జంకుతున్న జనాలు - People afraid to go to Mushirabad fish market
ముషీరాబాద్ చేపల మార్కెట్ అంతా గుంతలు, మురికి నీరు, చేపల వ్యర్థాలతో నిండిపోయింది. అక్కడ వస్తున్న దుర్వాసన వల్ల ప్రజలు మార్కెట్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

అడుగు తీసి అడుగు వేయాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. ధైర్యం చేసి వెళ్లిన వాళ్లలో కొందరు ఈ మురికి నీటిలో పడిన సందర్భాలూ ఉన్నాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యత లేకపోవడం వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సింది పోయి.. అపరిశుభ్రమైన ప్రాంతంలో మార్కెట్‌ని నిర్వహించడం మంచిది కాదని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్‌ని బాగు చేయించాలని... అలాగే నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'