ఇంటికి ఎవరైనా అతిథి వస్తే.. గౌరవంగా ఆహ్వానించి.. మర్యాదలు చేస్తాం. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా ఇంటికి ఎవరూ రాకండి అనేలా కరోనా పరిస్థితుల్ని మార్చేసింది. ఇలా అనటం మర్యాద కాదని తెలిసినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెల్ఫ్ లాక్ డౌన్ తప్పదంటున్నారు పట్నం వాసులు.
కరోనా మహమ్మారి అటు రాష్ట్రంలో.. ఇటు నగరంలో వేగంగా విస్తరిస్తోంది. వైరస్ బారినుంచి తమను తాము కాపాడుకోవటానికి కొందరు ఇంటికే పరిమితమై పనులు చక్కదిద్దుకుంటుండగా.. అనుకోని అతిథిలు ఇంటికి రావటం వల్ల అనుమానాస్పదంగా చూస్తున్నారు. వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా లక్షణాలు లేని వారే ఉండటం, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు ఇళ్ల వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు . కానీ ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన 2200 కోవిడ్ పాజిటివ్ బాధితులు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నారని, ప్రభుత్వ అధికారులకు సహకరించడం లేదని ఓ సర్వే నిగ్గుతేల్చింది.