గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు వర్ణణాతీతం. ప్రధాన రహదారులపై పీక్ సమయంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్‌లో లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. నగరంలోని నిర్మించిన 5 నూతన లింక్ రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు (ktr inaugurated link roads). నోవాటెల్ వెనక భాగంలోని వసంత్ సిటీ వద్ద నిర్మించిన మూడు లింక్ రోడ్ల జంక్షన్ వద్ద ప్రారంభించారు.
వసంత్ సిటీ నుంచి న్యాక్ వరకు 0.75 కిలోమీటర్లు, ఐడీపీఎ ఎంప్లాయిస్ కాలనీ నుంచి శ్రీల పార్కు ప్రైడ్ రోడ్ వరకు 0.46 కిలోమీటర్లు, నోవాటల్ నుంచి ఆర్టీఏ ఆఫీస్ వరకు 0.6 కిలో మీటర్లు, జేవీ హిల్స్ పార్క్ నుంచి మజీద్ బండ వరకు నిర్మించిన 1.01 కీమీ లింక్ రోడ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన 1.94 కీమీ లింక్ రోడ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు (ktr inaugurated link roads).
త్వరలో మరో ఆరు రోడ్లు..
భాగ్యనగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి రహదారులు చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 16 లింకు రోడ్లను పూర్తి చేశామని, వీటితో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గిందని... త్వరలోనే మరో 6 రోడ్లను పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న జన సాంద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు.
రూ.6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కొనసాగుతున్నాయని.. అంతేగాక, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద అదనంగా మొదటి దశలో రూ.313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దశల వారీగా మొత్తం 133 లింకు రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు.