మున్సిపాలిటీల్లో సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు చేయని ప్రయత్నమంటూ ఉండదు. అవి చేస్తాం...ఇవి చేస్తామంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటారు. ఇంటింటికి తిరిగి తమకే ఓటేయాలంటూ ఓట్లను అభ్యర్థిస్తారు. అయితే ఇదొక్కటే సరిపోదు. అందుకే ప్రచారానికి అందుబాటులో ఉండే అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు.
గతంలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, అంతర్జాలం సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చాయి. అందుకే పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచారానికి సామాజిక మాధ్యమాన్ని వేదికగా మలుచుకుంటున్నారు. ఫేసుబుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్ గ్రూపులు, టిక్‌టాక్ వీడియోల ద్వారా ఓటరుకు చేరువవుతున్నారు.
మున్సిపాలిటీల్లో సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం
ముఖ్యంగా...ఎన్నికల వేళ సెల్ ఫోన్ కీలకంగా మారింది. జనాన్ని కూడబెట్టాలన్నా.. ఓటేయండి అని అడగాలన్నా.. ఇప్పుడు ఆయుధం సెల్‌ఫోనే.. తమ వార్డు పరిధిలోని ఓటర్ల నంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూప్‌లు రూపొందించి రోజూ ఓటర్లను పలకరిస్తూ చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ర్యాలీలు, రోడ్డు షోలు ఒకెత్తయితే... సెల్‌ఫోను ద్వారా ప్రచారం మరో పెద్ద అవకాశంగా మారింది. సెల్‌ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశాలు, వాయిస్‌లు పంపి వారికి చిరాకు తెప్పించి కొత్త తలనొప్పులు, వ్యతిరేకత మూటకట్టుకోకుండా.. మద్దతు తెలిపిన వారికే సందేశాలు వెళ్లేలా అభ్యర్థులు జాగ్రత్తలు పడుతున్నారు.
ఆన్‌లైన్ ప్రచారాలతో ఆకట్టుకుంటున్న అభ్యర్థులు
పట్టణాల్లో అక్షరాస్యులు ఎక్కువగా ఉండి స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికంగా ఉంటుంది. అందుకే పోటీ చేయాలనుకున్నవారు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ప్రచారం చేస్తూ తమ వార్డుల్లోని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ కంపెనీలు సైతం తక్కువ మొత్తానికే గంపగుత్త సంక్షిప్త సందేశాలు పంపే వెసులుబాటు, అన్‌లిమిటెడ్ డేటా ఇస్తుండటంతో నేతలు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. కంప్యూటర్ల సాయంతోనూ తమ ప్రచార సందేశాలను రూపొందించి మూకుమ్మడిగా తమ వార్డుల్లోని ఓటర్లకు చేరవేయటం, ప్రతిరోజూ విభిన్న రీతితో ప్రచార పలకరింపుతో ఆకట్టుకోవటం, ఓటర్ల దృష్టి మరలకుండా చర్యలు చేపట్టడంతో ఈ ఎన్నికల్లో డిజిటల్ ప్రచారం కీలకంగా మారింది.
హామీలతో కూడిన పోస్టులు చేస్తున్న క్యాండెట్లు
ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు అంతర్జాలంలో పలు యాప్‌లు ఉన్నాయి. వాటి ద్వారా ఆకర్షణీయంగా ప్రచార చిత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తమ పనితీరు, చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. స్థానికంగా తమకు అనుకూలంగా ఉండేలా చిత్రాలు, అభివృద్ధి అంశాలను వివరిస్తూ లఘు సందేశాలు తయారు చేస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.
2014 ఎన్నికల్లో అన్ని పార్టీల అభ్యర్థులు రికార్డెడ్ వాయిస్‌తో ఫోన్‌కాల్ ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి అన్ని పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారానికి ఆసక్తి చూపుతున్నారు. తమ ఎన్నికల ప్రణాళిక హామీలు, ఇప్పటికే చేసిన పనులు, ప్రత్యర్థుల లోటుపాట్లతో కూడిన సందేశాలను రూపొందించి ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు అత్యంత సులువైన ప్రచార వేదికగా మారనున్నాయి.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్