తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపోరుకు వేళాయే... వచ్చేనెల మూడోవారంలో ఎన్నికలు! - municipal election in november

మున్సిపల్​ ఎన్నికలు వచ్చే నెల మూడో వారంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పురపాలక శాఖ నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది.

పురపోరుకు వేళాయే... వచ్చేనెల మూడోవారంలో ఎన్నికలు!

By

Published : Oct 24, 2019, 5:04 AM IST

Updated : Oct 24, 2019, 8:34 AM IST


పురపాలక ఎన్నికలపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో పుర పోరుకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు తీర్పు వచ్చిన తరుణంలో మున్సిపల్ ఎన్నికల విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ నిర్ణయం వెలువరించిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

వచ్చే నెల మూడో వారంలో పురపోరు...!

మీర్​పేట కార్పొరేషన్​లో పునర్విభజన

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు నేపథ్యంలో పురపాలక ఎన్నికలకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్లను తొలగించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే రిజర్వేషన్లు ప్రకటించనుంది. మీర్​పేట, జిల్లెలగూడ మున్సిపాలిటీలను కార్పొరేషన్‌లో విలీనం చేసినందున అక్కడ వార్డుల విభజన చేపట్టాల్సి ఉంది.

గతంలో న్యాయస్థానానికి నివేదించిన ప్రకారం 149 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానికనుగుణంగా నవంబర్ 21లోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త పురపాలక చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ మొదలు పోలింగ్ వరకు పదిహేను రోజుల్లోగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది.
పూర్తవుతున్న ఏర్పాట్లు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ల వివరాలు అందిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. పురపోరుకు అవసరమైన ఏర్పాట్లు ఎన్నికల సంఘం గతంలోనే చేపట్టింది. బ్యాలెట్ పత్రాలకు అవసరమైన కాగితం, పోలింగ్ సమయంలో వినియోగించే ఇంకు, తదితర సామగ్రి ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అధికారులకు శిక్షణ కూడా దాదాపుగా పూర్తయింది. పురపాలక కమిషనర్​లతోపాటు ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులందరితో ఈనెల 29న రాష్ట్ర ఎన్నికల సంఘం దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించనుంది. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లను సమీక్షించి అవసరమైన మార్గనిర్దేశాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియలన్నీ పూర్తిచేసి వచ్చే నెల మొదటి వారంలో పురపాలక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి: పుర ఎన్నికలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​

Last Updated : Oct 24, 2019, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details