తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్: కబ్జాలమయం నిజాంపేట కార్పొరేషన్ - బస్తీమే సవాల్​

మొన్నటి వరకు పంచాయతీగా ఉండి... ఇటీవల నగరపాలక సంస్థ మారింది హైదరాబాద్‌ సమీపంలోని నిజాంపేట్‌. అక్రమ లేఅవుట్లతో ఈ ప్రాంతం కబ్జామయం అయిపోయింది. దశబ్దాలుగా నీటి వనరులుగా ఉన్న వందల చెరువులు... ఆక్రమణకు గురయ్యాయి. రోడ్లు, నీళ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి సదుపాయాలు లేక స్థానికులు కష్టాలు అనుభవిస్తున్నారు. నిజాంపేట నగరపాలక సంస్థలోని సమస్యలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

MUNICIPAL ELECTIONS IN NIZAMPET CORPORATION
MUNICIPAL ELECTIONS IN NIZAMPET CORPORATION

By

Published : Jan 14, 2020, 5:08 PM IST

Updated : Jan 14, 2020, 5:18 PM IST

బస్తీమే సవాల్: కబ్జాలమయం నిజాంపేట కార్పొరేషన్

కళతప్పిన నిజాంపేట్

ఒకప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఆ గ్రామాలు పంట పొలాలతో కళకళలాడేవి. నగర విస్తరణతో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కాలక్రమేణా రూపురేఖలు మారిపోయాయి. సమీపంలోని బాచుపేట, నిజాంపేటలు కలిసి కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. 33 డివిజన్లలో లక్ష 8 వేలకుపైగా ఓటర్లున్నారు. పేరుకు నగరపాలక సంస్థే అయినా... ఇక్కడ తాగునీరు, పారిశుద్ధ్యం, భూ కబ్జాలు ప్రధాన సమస్యలు. మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ... నిజాంపేట్ పరిధిలోని 68 ప్రాంతాలకు ఇప్పటికీ నీరు అందడం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని కాలనీల్లో తాగునీరు 5 రోజులకొకసారి వస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలని పలుసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా... పట్టించుకోవట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. చేసేదేమి లేక దగ్గరలోని చెరువుకు వెళ్లి స్నానాలు, బట్టలు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నామని స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులు చెబుతున్నారు. హైదరాబాద్​కు సమీపంలో ఉన్నా బస్సు సౌకర్యం లేదు..

రాజధానికి నిజాంపేట సమీపంలో ఉన్నా... ఇప్పటికీ కొన్ని కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. కళాశాలలకు వెళ్లిన యువతులు, పనులకు వెళ్లిన మహిళలు సాయంత్రమైతే ఇంటికి చేరుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు తిరుగుతుండడంతో... అనేక చోట్ల రోడ్లు గుంతలమయమై అధ్వాన్నంగా మారాయి. మురుగు కాలువల సమస్య ఇక్కడి ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. చెత్త, చెదారం పేరుకుపోయి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. అధిక సంఖ్యలో కాలనీలు ఉన్నప్పటికీ... ప్రభుత్వాసుపత్రి లేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.

చెరువులను కూడా వదలకుండా కబ్జాలు

నిజాంపేటలోని మరో ప్రధాన సమస్య భూకబ్జాలు. పలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చెరువులను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. గతంలో వచ్చిన వరదల వల్ల నిజాంపేటలోని భండారి లేఅవుట్‌తోపాటు పలు అపార్ట్‌మెంట్‌లు మునిగిపోయాయి. అయినప్పటికీ ఆక్రమణలు ఆగలేదు.

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిజాంపేట్‌లో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ప్రారంభించాయి. వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే ఆసక్తి నెలకొంది.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: వేములవాడ, ధర్మపురిలో మున్సిపల్ సందడి

Last Updated : Jan 14, 2020, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details