పురపోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ పురపాలక ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలు జరుగుతోన్న పది కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీల్లో వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. ముసాయిదా ప్రకారం 130 పట్టణాల్లో ఓటర్ల సంఖ్య 53,37,260. ఇందులో పురుషులు 26,72,021, మహిళలు 26,64,885 మంది కాగా ఇతరులు 354 మంది ఉన్నారు.
అత్యధికంగా నిజామాబాద్లో
అత్యధికంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3,06,544 మంది ఓటర్లున్నారు. 2,72,194 మంది ఓటర్లతో కరీంనగర్ కార్పొరేషన్ రెండో స్థానంలో ఉంది. లక్షా 74వేల మంది ఓటర్లతో రామగుండం కార్పొరేషన్, లక్షా 69వేల మంది ఓటర్లతో మహబూబ్నగర్ మున్సిపాల్టీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లక్షా 27వేల మంది ఓటర్లతో ఆదిలాబాద్ మున్సిపాల్టీ ఐదో స్థానంలో ఉంది.
అమరచింతలో అతితక్కువ ఓటర్లు
ఏడు కొత్త కార్పొరేషన్లలో నిజాంపేటలో మాత్రమే లక్షకు పైగా ఓటర్లున్నారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాల్టీలో అతితక్కువ ఓటర్లున్నారు. అక్కడ ఓటర్ల సంఖ్య కేవలం 8,789 మాత్రమే. 9,014 మంది ఓటర్లతో అలంపూర్, 9,263 మంది ఓటర్లతో వర్ధన్నపేట, 9,575 మంది ఓటర్లతో వడ్డేపల్లి, 9,664 మంది ఓటర్లతో కొత్తపల్లి కింది నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
నాలుగో తేదీన ఓటర్ల జాబితా
ఓటర్ల జాబితా ముసాయిదాపై వచ్చే నెల రెండో తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నాలుగో తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఓటర్లు స్థానికంగా కార్యాలయాలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ tsec.gov.in లో తమ పేర్లు, వివరాలు సరిచూసుకోవచ్చు. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను కూడా వెబ్ సైట్ లో పొందుపర్చారు.
రిజర్వేషన్లు ఖరారుకు సన్నద్ధం
ఓటర్ల జాబితా పూర్తైన వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు పురపాలక శాఖ సమాయత్తమవుతోంది. ఓటర్ల జాబితాతో పాటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏ కేటగిరీకి ఎన్ని పదవులు రిజర్వ్ అవుతాయన్నది నాలుగో తేదీ సాయంత్రం ప్రకటిస్తారు. ఏ పదవులు ఏ వర్గానికి దక్కుతాయన్నది మాత్రం ఐదో తేదీన తేలనుంది.
2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 50 శాతాన్ని మించకుండా మిగతా రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం స్థానాలు మహిళలకు దక్కుతాయి. కేవలం ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు కాకుండా అన్నింటి రిజర్వేషన్లను కూడా ఇప్పుడే ఖరారు చేస్తారు.
రిటర్నింగ్ అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయం అంశాలను సాధారణ, వ్యయ పరిశీలకులకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వివరించారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన పలు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దాదాపుగా 200 మందికి బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.