తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhuvan app: భువన్​ యాప్​ కార్యక్రమాలు పున:ప్రారంభించాలి: పురపాలక శాఖ - తెలంగాణ వార్తలు

జీహెచ్​ఎంసీ మినహా రాష్ట్రంలోని పట్టణాల్లోని ఆస్తుల వివరాలను భువన్ యాప్​తో అనుసంధానించే కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. గతంలో ఆగిపోయిన ఈ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. జులై చివరకల్లా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

bhuvan app, telangana municipal department
భువన్ యాప్, పురపాలక శాఖ ఆదేశాలు

By

Published : Jun 25, 2021, 1:01 PM IST

Updated : Jun 25, 2021, 2:22 PM IST

జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో పట్టణప్రాంతాల్లోని ఆస్తుల వివరాలన్నింటినీ భువన్ యాప్​తో అనుసంధానించే కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని పురపాలకశాఖ స్పష్టం చేసింది. 2020 జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అప్పుడున్న 139 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని రూ.4.5లక్షల ఆస్తులను భువన్ యాప్​తో అనుసంధానించారు.

జులైకల్లా పూర్తి

ఆ తర్వాత వివిధ కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మిగిలిన ఆస్తుల అనుసంధానం ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. జులై నెలాఖరుకల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని, అలక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమస్త సమాచారం

మున్సిపాలిటీల్లోని సమస్త సమాచారం సేకరించి భువన్‌ యాప్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ట్రేడ్‌ లైసెన్సులు, విద్యుత్తు మీటర్‌, భవనం వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. నివాసానికి వినియోగిస్తున్నారా..? నల్లా కనెక్షన్‌ ఉందా..? అనేది సర్వే ద్వారా సేకరించి యాప్‌లో పొందపర్చాల్సి ఉంటుంది. సత్వరమే మిగిలి ఉన్న పనులు ప్రారంభించాల్సిందిగా పురపాలకశాఖ అధికారులు నిర్ణయించారు.

భవన వివరాల నమోదు

పురపాలక శాఖ ప్రత్యేకంగా భువన్‌యాప్‌ ద్వారా ప్రతీ ఆస్తిపన్ను మదింపు వివరాలు, భవన చిత్రం, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా చరవాణిలో చిత్రాలు తీసి నిక్షిప్తం చేస్తారు. ఇంటినంబర్లు వేయని భవనాలు, పన్ను పరిధిలోకి రాని అంతస్తులు, అక్రమ నిర్మాణాలు, భవనాల విస్తీర్ణం వంటి అంశాలు నమోదు చేస్తారు. దీంతో పాటు వాణిజ్య అవసరాలకు సంబంధించిన వివరాలు, నల్లా కనెక్షన్లు, సెల్‌ టవర్లు, దుకాణాల లైసెన్స్‌ అన్నింటి వివరాలను భువన్‌ యాప్‌ ద్వారా వెంటనే నమోదు చేస్తారు.

సిబ్బందికి శిక్షణ

ఒక్కో ఇంటికి రెండేసి చిత్రాలు తీయాలి. ఆయా ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు చిత్రాలను యాప్‌లో నమోదు చేయాలి. ఒక్కో ఇంటి వివరాల నమోదుకు కొంత నగదును చెల్లించనున్నారు. ఈ యాప్‌లో వివరాల నమోదుకు పురపాలిక అధికారులు ముందుగా ఆయా శాఖల నుంచి వివరాలు సేకరించాలి. సాంకేతిక సిబ్బంది నియామకంతో పాటు వీరికి సహకరించేందుకు ఇతర సిబ్బందిని వినియోగించుకోనున్నారు. వారికి శిక్షణ ఇచ్చి పనులు ప్రారంభిస్తారు. పురపాలిక ఇంజినీరు, మేనేజర్, రెవెన్యూ అధికారి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. మిగిలిన ఆస్తుల అనుసంధానం ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పురపాలకశాఖ ఆదేశించింది. పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:MAA Election: 'మాది సినిమా బిడ్డల ప్యానల్‌... పదవి కోసం పోటీ చేయడం లేదు'

Last Updated : Jun 25, 2021, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details