రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పట్టణ ప్రగతి అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 24 నుంచి కార్యక్రమం ప్రారంభించి పది రోజులపాటు కొనసాగించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో పట్టణ ప్రగతిపై మంత్రులకు అవగాహన కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజాప్రతినిధులు, అధికారులకు పూర్తిస్థాయిలో మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. శాసనసభ్యులు, నగరపాలక సంస్థల మేయర్లు, పురపాలక సంస్థల ఛైర్ పర్సన్లు, జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు సదస్సుకు హాజరుకానున్నారు.
పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలి
పట్టణప్రగతికి సన్నాహకంగా జరగనున్న సదస్సులో కార్యక్రమ నిర్వహణపై చర్చిస్తారు. నిధులను సద్వినియోగం చేసుకుని పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా పట్టణాలను అభివృద్ధి చేసే విధానాలపై సమాలోచనలు జరుపుతారు. విధివిధానాలను ఖరారు చేయడంతో కార్యాచరణను ఖరారు చేస్తారు. పట్టణప్రగతికి సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలు, తన ప్రణాళికలు, ఆలోచనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.