Mulugu Siddanthi: జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యుడు, పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి(63) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం గుండెనొప్పి రాగా, యశోదా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు నిర్ధారించారు. భౌతికకాయాన్ని దోమలగూడలోని ఆయన కుమార్తె శివజ్యోతి నివాసానికి తరలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు మలక్‌పేట్‌లోని రేస్‌కోర్స్ వద్ద ఉన్న హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Mulugu Siddanthi: ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం
20:48 January 23
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గుండెపోటుతో కన్నుమూత
గుంటూరు పండరీపురానికి చెందిన ఆయన డిగ్రీ వరకు ఇక్కడే చదువుకున్నారు. తొలినాళ్లలో ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆయన సతీమణి విజయ గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఒక పర్యాయం ఎన్నికయ్యారు. వరప్రసాద్ తన తాత నాగలింగయ్య బాటలో నడిచి జ్యోతిష పండితుడిగా గుర్తింపుపొందారు. తిథి, వార, నక్షత్రాలు, విశేషాలు ఉండేలా 1997లో విడుదల చేసిన బాబా స్టార్‌డైరీ ప్రజాదరణ పొందింది. కుజ దోషం, అంగారకుడు, రాహు, కేతు ప్రభావాలు తదితర పుస్తకాలు రాశారు.
గుంటూరులో పూర్వీకుల నుంచి వస్తున్న శ్రీశైవపీఠాన్ని కొన్నాళ్ల పాటు నిర్వహించారు. ములుగు యూట్యూబ్ ఛానెల్ సహా పలు వెబ్‌సైట్లలో జ్యోతిష విషయాలు, దిన, వార ఫలాలు, పూజలు, పరిహారాలు చెబుతూ ప్రసిద్ధిగాంచారు. శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ ఆస్థాన సిద్ధాంతిగా ఉంటూ ఏటా ఉగాది రోజున పంచాంగ పఠనం చేసేవారు. రామలింగ సిద్ధాంతి మరణంపై ఏపీ సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. గ్రహాల ఆధారంగా రాశి ఫలాలు అంచనా వేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:పారిశ్రామిక మౌలిక వసతులకు నిధులు కోరుతూ.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ