భాగ్యనగరంలోని రోడ్లకు ఇరువైపుల భారీగా మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్గా వ్యవహరించే నూతన విధానంతో వీటిని నాటనుంది. తీగజాతి, కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరసలో నాటనున్నారు. ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, మెగాఫోటమికా జాతి మొక్కలు... చివరి వరసల్లో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి చెట్లను నాటుతారు. ముందుగా పూల మొక్కలు, రెండు మూడు ఫీట్లు దట్టంగా పెరిగే మొక్కలు, చివరగా ఏపుగా పెరిగే చెట్లు వాహనదారులకు కనువిందు చేయనున్నాయి.
సీఎస్ సంతృప్తి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచనలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ విధమైన ప్లాంటేషన్‌ను జీహెచ్ఎంసీ పెద్దఎత్తున చేపట్టింది. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ విధానంపై సీఎస్ సోమేశ్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆరాంఘర్ వరకు పూర్తిస్థాయిలో మల్టీలెవల్ ప్లాంటేషన్‌ను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ప్రధాన రహదారి మధ్యలో ఉన్న రోడ్ డివైడర్లలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో భాగంగా సీఎస్ మొక్కలు నాటారు.