తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..! - mro vijaya reddy murder case

భూయాజమాన్య హక్కులపై అవగాహన లేమి... వివాదా పరిష్కారాన్ని ఎవరు చూపుతారన్న కనీస పరిజ్ఞానం లేని ఓ వ్యక్తి మూర్ఖత్వం తహసీల్దార్‌ ప్రాణం తీసింది. మరో ఇద్దరు ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఓ వైపు న్యాయ వివాదాల్లో భూమి నలుగుతూనే ఉన్నా... చట్టబద్ధమైన హక్కులు కల్పించాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు చివరికి హత్యకు పాల్పడ్డాడు. అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఘటనలో రక్షిత కౌలుదారు హక్కుల చట్టం-1950 కింద హక్కులపై స్పష్టత కొరవడిన భూములకు యజమాని ఎవరనేది తేలాల్సి ఉండగానే తహసీల్దార్​ విజయా రెడ్డి హత్యోదంతం చోటుచేసుకుంది.

తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!

By

Published : Nov 5, 2019, 6:01 AM IST

Updated : Nov 5, 2019, 6:42 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం గౌరెల్లికి సుమారు 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో బాచారం గ్రామం ఉంది. సర్వే నంబర్‌ 87 నుంచి 101 వరకు సుమారు 130 ఎకరాల భూమి ఉంది. సర్వే నెంబర్‌ 96లో కూర దుర్గయ్య పేరుతో 5.37 ఎకరాల భూమి ఉంది. ఇది ఆయన తండ్రి వెంకయ్య నుంచి వారసత్వంగా వచ్చినట్లు దస్త్రాలు చెబుతున్నాయి. వెంకయ్యకు దుర్గయ్య,కృష్ణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకయ్య చిన్న కుమారుడైన కృష్ణ కొడుకే నిందితుడు సురేష్‌. అయితే ఈ భూమి ఇద్దరు అన్నద్దముళ్ల పేర్లపైకి సమానంగా పంపిణి కావాల్సి ఉంది. ఇంతలో రక్షిత కౌలుదారు హక్కుల చట్టం మేరకు కౌలుదారుల హక్కుల కోసం కోర్టులను ఆశ్రయించడంతో వివాదం మలుపు తిరిగింది.

వివాదం కోర్టుల్లో ఉండటం వల్ల రెవెన్యూ సిబ్బంది కొత్త పాసుపుస్తకాల జారీని నిలిపి వేశారు. దీనితో కొందరు రైతులు భూ యాజమాన్య హక్కులపై రెవెన్యూ సిబ్బందిని తరుచూ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సురేష్‌ కూడా తహసీల్దార్‌ను పలుమార్లు కలిసి పాసుపుస్తకాలను జారీ చేయాలంటూ అడిగినట్లు చెబుతున్నారు. వివాదాల్లో భూమి ఉండటం వల్ల పుస్తకాల జారీ సాధ్యం కాదని తహసిల్దార్‌ సర్ది చెబుతు వచ్చింది. సోమవారం ఫిర్యాదుల దినం సందర్భంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆమెను కలిసేందుకు వచ్చి తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

గౌరెల్లి గ్రామానికి చెందిన 11 మంది రైతులు బాచారం రెవెన్యూ పరిధిలో 1954లో రాజా అనందరావు నుంచి భూమి కొనుగోలు చేసి, అనంతరం వాటిపై 1996లో ఆర్‌ఓఆర్‌ చట్టం కింద పట్టా పాసుపుస్తకాలు తీసుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, సాగుదారులుగా కొనసాగుతున్నారు. బాహ్యవలయ రహాదారి నిర్మాణంలోనూ ఈ రైతులు నష్టపోయిన భూమికి పరిహారం కూడా పొందారు.

ఇదిలా ఉండగా 2014లో రక్షిత కౌలుదారు చట్టం కింద హక్కులు ఉన్నాయంటూ అహ్మద్‌ హయత్‌తో పాటు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యం మేరకు రంగారెడ్డి సంయుక్త కలెక్టర్‌ నుంచి సాగులో ఉన్న రైతులకు నోటీసులు అందాయి. సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు హయత్‌నగర్‌ ఆర్డీవో విచారణ చేపట్టారు. 25.10.2016లో రక్షిత కౌలు హక్కుదారుల చట్టం ప్రకారం అహ్మద్‌ హయత్‌తో పాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు. అహ్మద్‌ హయత్‌తో పాటు ఇతరులు భూమిని గుండ్ల పోచంపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారులైన జైపాల్‌, హరివర్ధన్‌ రెడ్డి అనే ఇద్దరికి జీపీఏ ఇస్తూ విక్రయించారు. ఈ క్రమంలో ఈ భూములను విక్రయాలకు పెడుతుండటం, చేతులు మారుతుండటం చోటుచేసుకున్నాయి. దీనిపై రైతులు జేసీ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా అక్కడ ఆర్డీవో ఆదేశాలనే సమర్దించడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. మరోవైపు ఈ మండలంలో 87 సర్వే నెంబర్‌ నుంచి 101 వరకు రక్షిత కౌలు హక్కుదారుల చట్టానికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి.

నిదితుడు సురేష్‌ తొలుత ఆటోడ్రైవరుగా పనిచేసేవాడు. స్థిరాస్తి వ్యాపారం పుంజుకోవడంతో ఆ రంగంలోకి దిగాడు. గ్రామంలో అందరితో బాగానే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అతను ఇలా చేశాడంటే నమ్మలేక పోతున్నామని గ్రామస్థులు అంటున్నారు. తన వాటా భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న ఓ వ్యక్తికి విక్రయించగా భూమి హక్కులు లేకపోవడం వల్ల ఆయన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పాసుపుస్తకాల కోసం సురేష్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సురేష్‌ తాతకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు దుర్గయ్య కాగా, చిన్న కుమారుడు సురేష్‌ తండ్రి కృష్ణయ్య. 7 ఎకరాల్లో తమ వాటా రెండెకరాలు మాత్రమేనని నిందితుడి తండ్రి కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన వ్యవహారాలన్నింటిని అన్న దుర్గయ్యనే చూసుకుంటున్నాడని తెలిపారు. ఈ విషయంపై సురేష్‌కు కనీస అవగాహన కూడా లేదని స్పష్టం చేశారు.

విజయా రెడ్డిని సురేష్‌ సజీవ దహానం చేసే ముందు ఎవరితోనైనా మాట్లాడాడని పోలీసులు ఆరా తీశారు. చాలా సార్లు సురేష్‌ పెద్దనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లుగా గుర్తించారు. అతనొక్కడే ఉసిగొల్పాడా ఇంకేవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. భూవివాదాన్ని పరిష్కరించనందుకు నిరసనగా పెట్రోల్‌తో తహసిల్దార్‌ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసుకోమని సురేష్‌ను పంపించినట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపాన్ని అదుపు చేసుకోలేక క్షణికావేశంలో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!

ఇవీచూడండి:అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య

Last Updated : Nov 5, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details