హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం నెత్తురోడుతోందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించుతామని రేవంత్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 2009లో ఈ రోజునే తన పుట్టిన రోజున, తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు ప్రకటించిందని.. ఆ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు ప్రజల కోసం జూబ్లీహిల్స్‌లో క్యాంపు కార్యాలయం ప్రారంభించినట్లు తెలిపారు. గాంధీ భవన్‌లో 35 ఏళ్లుగా అటెండర్‌గా పని చేస్తున్న షబ్బీర్ చేతులు మీదుగా కార్యాలయం ప్రారంభించారు.
ప్రతి శనివారం అందరికీ అందుబాటులో ఉంటా..
ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని రేవంత్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర సాధన కోసం 1969, 2009లో పోరాటం చేసిన వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, జేసీ దివాకర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యేలు శ్రీశైలం గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు.
జూబ్లిహిల్స్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభం ఇదీ చూడండి: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై సిట్ కార్యాచరణ ప్రారంభం