హైదరాబాద్ నగరంలోని డివిజన్ల పునర్విభజన, ఓట్లు చేర్పించడంపై సరైన దిశలో కాంగ్రెస్ పోరాటం చేయాల్సి ఉందని ఎంపీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎమ్ఐఎమ్ పునర్విభజన బోగస్ ఓట్లతో గెలవాలని చూస్తుందని ఆరోపించారు. ఇందిరాభవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. డివిజన్ల పునర్విభజన అంటే మొత్తం జనాభా డివైడెడ్ బై సీట్లు ఉండేటట్లు చూడాలన్నారు. కానీ ఇక్కడ అడ్డగోలుగా చేశారని అన్నారు. పాతబస్తీలో 15 నుంచి 30 వేల ఓట్లు ఉంటే.. ఇంకో చోట 70 నుంచి 80 వేలు ఉండేటట్లు చేశారని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
టీమ్ సిద్ధంగా ఉండాలి
డీలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. హైదరాబాద్ మేయర్ పదవిని బీసీ ఉమెన్‌కు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్న ఎంపీ.. మళ్లీ డివిజన్లు ఏమైనా మారుస్తారేమో అన్నది పరిశీలించాలన్నారు. ఎన్నికల సమయంలో లీగల్‌గా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకోడానికి లీగల్ టీమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు. 150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువకులను గుర్తించి గడప గడపకు పాదయాత్ర చేసి వాళ్లను నామినేట్ చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.