భాజపాకు సొంతంగా నాయకుల్ని తయారుచేసుకునే సత్తా లేక.... కాంగ్రెస్ నేతల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌కు భాజపా ఏంచేసిందని జీహెచ్ఎంసీలో ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలని భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
జనసేనతో ఎలాంటి పొత్తు లేదని బండి సంజయ్ అన్నారని.. సంజయ్‌కు తెలియకుండానే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ పవన్ కల్యాణ్ మద్దతు అడిగారా అని ప్రశ్నించారు. మూసీ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకుని ఉంటే హైదరాబాద్‌కు వరద ముంపు తప్పేది కాదా రేవంత్‌రెడ్డి నిలదీశారు. ప్రకాశ్ జావడేకర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెరాస, భాజపాలు వరద, బురదలా కలిసి పని చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెరాస, భాజపాను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.... బల్దియాలో కాంగ్రెస్‌కే పట్టం కడతారని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌పై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారని.. తాను ఆయనపైనే ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాశ్ జావడేకర్‌కు రేవంత్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు.
మైహోం సిమెంట్ సంస్థకు పర్యావరణ, అటవీ అనుమతులు లేవని తనతోపాటు భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫిర్యాదు చేస్తే ప్రకాశ్ జావడేకర్ ఏం చర్యలు తీసుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. శ్రీశైలం, కల్వకుర్తి ప్రాజెక్టుల అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. హుస్సేన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు తీర్పు ఇచ్చిందని.. అక్కడ సచివాలయ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించలేదని రేవంత్ ధ్వజమెత్తారు. వీటిపై సమాధానం చెప్పాకే జావడేకర్ దిల్లీ వెళ్లాలని రేవంత్ డిమాండ్ చేశారు.