తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటుకు నోటు కేసు విచారణపై హైకోర్టులో రేవంత్​ పిటిషన్​

ఎంపీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు.. ప్రధాన సాక్షులు స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని కోరారు.

హైకోర్టులో ఎంపీ రేవంత్​ రెడ్డి పిటిషన్​
హైకోర్టులో ఎంపీ రేవంత్​ రెడ్డి పిటిషన్​

By

Published : May 13, 2021, 5:24 PM IST

ఓటుకు నోటు కేసులో సాక్షుల విచారణ ప్రక్రియపై ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు.. ప్రధాన సాక్షులు స్టీఫెన్ సన్, ఆయన స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని కోరారు. ఓటుకు నోటు కేసులో అనిశా ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల సాక్షుల విచారణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే దర్యాప్తు అధికారులు అశోక్ కుమార్, మల్లిఖార్జున్ రెడ్డి, పంచనామా సాక్షులు ఎ.శ్రీకాంత్, జి.కపూర్ ల ప్రధాన విచారణ ముగిసే వరకూ... స్టీఫెన్ సన్, ఆయన కుమార్తె జెస్సికా, స్నేహితుడు మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి అనిశా కోర్టును కోరారు.

నిరాకరణ

రేవంత్ రెడ్డి అభ్యర్థనను పాక్షికంగా అనుమతించిన అనిశా న్యాయస్థానం.. మాల్కం టేలర్, జెస్సికాల చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తయ్యే వరకు స్టీఫెన్ సన్ క్రాస్ ఎగ్జామినేషన్ వాయిదా వేసేందుకు అంగీకరించింది. దర్యాప్తు అధికారులు, పంచానామా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే వరకు ముగ్గురి క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపి వేసేందుకు మాత్రం నిరాకరించింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ ప్రధాన విచారణ ఇటీవలే ముగిసింది. అనిశా అభ్యర్థన మేరకు స్టీఫెన్ సన్ కుమార్తె జెస్సికాను సాక్షుల జాబితా నుంచి తొలగించేందుకు న్యాయస్థానం అనుమతినిచ్చింది.

కౌంటరు దాఖలు చేయాలని ఆదేశం

స్టీఫెన్ సన్​ను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సాక్షుల విచారణ ప్రక్రియపై అనిశా న్యాయస్థానం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు అధికారుల విచారణను చివరలో చేపట్టాలన్న సంప్రదాయాన్ని కూడా అనిశా న్యాయస్థానం విస్మరించిందని పిటిషన్​లో పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు, పంచనామా సాక్షులు, ప్రధాన సాక్షులు చెప్పేది సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి.. అందరి ప్రధాన విచారణ పూర్తయ్యాకే క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతించాలని కోరారు. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన వేసవి సెలవుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి.. కౌంటరు దాఖలు చేయాలని అనిశాను ఆదేశిస్తూ విచారణను జూన్ 18కి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌

ABOUT THE AUTHOR

...view details