ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాలతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. సచివాలయ ప్రాంగణంలోని మసీదు, దేవాలయాలను కూలగొట్టి ప్రజల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు మత విశ్వాసాలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రికి వాస్తుపై మక్కువ ఎక్కువ... కాకపోతే... అది ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు.
వాస్తు పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారు : రేవంత్రెడ్డి
మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. ఆయన మత విశ్వాసాలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించారు. వాస్తు నమ్మకాలను ప్రజలపై రుద్దుతున్నారని విమర్శించారు.
''ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన గత 16 ముఖ్యమంత్రుల కుమారులు సీఎం పీఠం ఎక్కలేదు. అందుకే సచివాలయం కూల్చి... కొత్త భవనం నిర్మిస్తే.. మీ కుమారుడు ముఖ్యమంత్రి అవుతారని'' ఎవరో వాస్తు పండితుడు కేసీఆర్కు చెప్పారని రేవంత్ అన్నారు. ఈ కారణంగానే మూఢ నమ్మకాలతో సచివాలయ భవనాలు కూల్చుతున్నారని ఆరోపించారు. ఇలా బహిరంగంగా ప్రజలపై మూఢనమ్మకాలను రుద్దడం మంచిది కాదన్నారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినప్పటికీ... ప్రభుత్వం కోర్టును తప్పుదోవపట్టించిందని అన్నారు. సచివాలయం కూలగొట్టడానికి మంత్రివర్గం నుంచి సరైన ఆదేశాలు లేవని తెలిపారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే సచివాలయ కూల్చివేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం