MP Raghurama Krishna Raju : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధానిపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. విశాఖ రాజధాని అని ప్రకటించి సీఎం కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని లేఖలో తెలిపారు. రాజధానిపై సుప్రీంలో కేసు విచారణలో ఉన్న సమయంలో.. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని వివరించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో విన్నవించారు.
మారేది ఇంటి చిరునామా మాత్రమే: జగన్ విశాఖకు మారితే ఆయన ఇంటి చిరునామా మాత్రమే మారుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. రాజధాని మార్పు అనేది అసాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగినా ప్రయోజనం శూన్యమని విమర్శించారు. కోర్టులు, రాజ్యంగాన్ని జగన్ అపహాస్యం చేశారన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చట్ట విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు పాల్పడితే.. ప్రభుత్వాలే కూలిపోయాయని అన్నారు.