తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా - mp raghu rama krishna raju news

ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

mp-raghuram krishna raju-bail-petition-to-hear-by-supreme-today
నేడు సుప్రీంలో ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్​పై విచారణ

By

Published : May 17, 2021, 7:26 AM IST

Updated : May 17, 2021, 12:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణనను సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రఘురామ తరఫున ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దుష్యంత్ దవే, వి.వి.గిరి మాట్లాడారు. బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

అందుకు అవకాశం ఇవ్వాలి..

రఘురామకు బెయిల్‌తో పాటు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని రోహత్గి కోరారు. రఘురామను అరెస్టు చేసిన తీరును కోర్టుకు వివరించారు. కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పని చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేవలం బెయిల్ రాకూడదనే సెక్షన్ 124 (ఏ) కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయకుండానే అదనపు డీజీ విచారణకు ఆదేశించారని రోహత్గీ పేర్కొన్నారు. విచారణ ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు.

అందుకే ఎఫ్​ఐఆర్​ నమోదు..

గుంటూరుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్కడా ఎఫ్ఐఆర్ చేశారని వాదనలు వినిపించారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి, హింసించారని ధర్మాసనానికి తెలియజేశారు. ఈ క్రమంలో అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపీ మేజిస్ట్రేట్‌కు చూపించారని.. ఈ మేరకు రఘురామకు డిసెంబర్‌లో బైపాస్ సర్జరీ కూడా జరిగిందన్నారు. రమేష్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని బెంచ్​కు తెలిపారు.

ప్రభుత్వం తరఫు వాదన..

ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలపై ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్మీ ఆస్పత్రి ఉందా అని సుప్రీం ఆరా తీసింది. ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థేనని న్యాయవాది దవే పేర్కొన్నారు. గోకర్ణ, సికింద్రాబాద్‌లో ఆర్మీ ఆస్పత్రి ఉందని ముకుల్‌ రోహత్గి కోర్టుకు తెలిపారు. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదని ఎంపీ తరఫున రోహత్గీ అన్నారు. ప్రతివాదులకు పిటిషన్‌ కాపీలను మెయిల్‌ ద్వారా అందించాలని సుప్రీం స్పష్టం చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈలోగా మెయిల్ ద్వారా సంబంధిత డాక్యుమెంట్లు పంపించాలని ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీంలో సవాల్..

బెయిల్‌ నిరాకరణపై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఎంపీ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ చేస్తోంది. మరోవైపు తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామ కుమారుడు భరత్ మరో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్ తర్వాత భరత్ అభ్యర్థనపై విచారణ చేయనుంది.

మధ్యంతర బెయిల్ కోసం..

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని రఘురామకృష్ణరాజు సుప్రీంను ఆశ్రయించారు. సీఐడీ కస్టడీలో తన తండ్రి దాడికి గురయ్యారని... ఆయనకు దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుల ఆధ్వర్యంలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆయన కుమారుడు భరత్‌ మరో పిటిషన్‌ వేశారు. తమ తండ్రికి ప్రాణహాని ఉన్నందున వై కేటగిరీ భద్రతను కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరారు.

ఇప్పటికీ జైలులోనే..

ఎంపీ రఘరామకృష్ణరాజు ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలని నిన్న రాత్రి హైకోర్టు ఆదేశించినా.. ఆర్డర్‌ కాపీ రాలేదంటూ రఘురామకృష్ణరాజు తరలింపులో జాప్యం కొనసాగుతోంది. సీఐడీ అధికారుల తీరుపై ఎంపీ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు:మెజిస్ట్రేట్ ఉత్తర్వులనూ పట్టించుకోరా.. సీఐడీపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Last Updated : May 17, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details