తెలంగాణ

telangana

ETV Bharat / state

రఘురామ ఎపిసోడ్: అరెస్టు నుంచి బెయిల్ వరకు ఇలా.. - RRR Latest Update

ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అపెక్స్ కోర్టులో ఊరట లభించింది. రఘురామకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సమ్మతించింది. ట్రయల్‌ కోర్టులో పది రోజుల్లోగా పూచీకత్తు సమర్పించాలని పిటిషనర్​ను ఆదేశించింది. రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటి నుంచి సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్​పై విచారణ జరిగే వరకు ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. బెయిల్ పిటిషన్‌పై రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు.

RRR over all
రఘురామకృష్ణరా

By

Published : May 21, 2021, 8:45 PM IST

రఘురామ ఎపిసోడ్: అరెస్టు నుంచి బెయిల్ వరకు ఇలా..

ఈనెల 14న సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు ఎంపీ రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. రఘురామ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. ఎంపీ రఘురామను పోలీసులు హైదరాబాద్​ నుంచి విజయవాడ తరలించి.. సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో ఆయన తరపు న్యాయవాదులు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అదేరోజు అర్ధరాత్రి వరకూ ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత రోజు అంటే ఈనెల 15న సీఐడీ కార్యాల‌యంలోనే ఎంపీకి జీజీహెచ్ వైద్య బృందంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఈ సమయంలోనే హైకోర్టు రఘురామ తరపున దాఖలైన పిటిషన్​ను డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని ర‌ఘురామ‌కు హైకోర్టు సూచించింది. ఆ తర్వాత ట్రయల్స్ కోర్టులో జడ్జి ముందు ఎంపీని పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు తనను కొట్టారని జడ్జికి గాయాలు చూపి.. రఘురామ రాతపూర్వక ఫిర్యాదు చేశారు. రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. గుంటూరు జీజీహెచ్‌, రమేశ్‌ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

మళ్లీ హైకోర్టుకు... అటునుంచి సుప్రీంకోర్టుకు..

ఎంపీని కొట్టిన సంగతి, కమిలిపోయిన గాయాలకు సంబంధించిన ఫొటోలతో న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టుకు లేఖ రాశారు. అత్యవసర విచారణ జరిపిన న్యాయస్థానం... ఎంపీ రఘురామ గాయాలపై వైద్య పరీక్షలకు ముగ్గురు సభ్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని అదనపు ఏజీని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. రఘురామకృష్ణరాజుకు న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో బెయిల్‌ మంజూరు చేయాలంటూ... సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మే 16న ఇదీ జరిగింది..

వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును జీజీహెచ్​కు తరలించారు. గాయాలపై.. మెడికల్‌ బోర్డు నివేదికలో జాప్యం జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. రమేశ్ ఆసుపత్రిలో చేర్చకుండా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఎంపీకి గాయాలు కాలేదని కోర్టులకు మెడికల్‌ బోర్డు తెలిపింది. రఘరామను రమేశ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. తన భర్తకు ప్రాణహాని ఉందని ఎంపీ రఘురామ భార్య రమ వీడియో విడుదల చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కుమారుడు భరత్ లేఖ రాశారు. రఘురామ ప్రాణాన్ని కాపాడాలని.. రాష్ట్రపతికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

17వ తేదీన కీలక ఆదేశాలు...

ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలను వీడియో తీసి సీల్డ్ కవర్​లో అందజేయాలని, ఇందుకు తెలంగాణ న్యాయవ్యవస్థ సహకరించాలని స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి ఎంపీ రఘురామను తరలించారు. 18న ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేశారు.

ప్రభుత్వం కౌంటర్ దాఖలు..

ఈనెల 19న ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రఘురామకృష్ణరాజు ప్రకటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నట్లు ధ్రువీకరించుకున్న తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. ఎవరో వచ్చి ఫిర్యాదు చేసేవరకు ప్రభుత్వం చేతులు ముడుచుకొని ఎదురుచూడాలని చెప్పే హక్కు పిటిషనర్‌కు లేదంది.

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రఘురామ కుటుంబసభ్యులు

ఈనెల 20న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబసభ్యులు కలిశారు. రఘురామకృష్ణరాజును వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. రఘురామపై రాజద్రోహం కింద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. అంతకుముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ రఘురామ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. వైకాపా ప్రభుత్వం రఘురామను కుట్రపూరితంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఆయన ప్రాణానికి ముప్పు ఉందని.. రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్‌ ఇవాళ స్పందించారు. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. ఈ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు.

తాజా పరిణామం ఇదీ..

వాడీవేడి వాదనల అనంతరం... ఎంపీ రఘురామకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. కేసు దర్యాప్తుకు రఘురామకృష్ణరాజు సహకరించాలని స్పష్టం చేసింది.

అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నాం..

కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేటంతటి అభియోగాలు కావు. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇస్తున్నాం. న్యాయవాది సమక్షంలో రఘురామ విచారణకు హాజరుకావచ్చు. కేసు దర్యాప్తులో సాక్షులను ప్రభావితం చేయకూడదు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదు. కేసు దర్యాప్తులో రఘురామకృష్ణరాజు సహకరించాలి. దర్యాప్తు అధికారులు ఒకరోజు ముందు రఘురామకు తెలపాలి. రఘురామ తన గాయాలను మీడియాకు చూపించవద్దు. తన గాయాలను మీడియాకు చూపిస్తే తీవ్రంగా పరిగణిస్తాం- సుప్రీంకోర్టు

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని సీఎం కక్షపూరిత చర్యలకు దిగారు. జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ వేశారని రఘురామపై కక్ష. బెయిల్ రాకుండా ఉండటం కోసమే రాజద్రోహం కేసు పెట్టారు. కాలి బొటనవేలు పక్కన ఫ్రాక్చర్‌ అయ్యిందని వైద్యులు తెలిపారు. కేదార్‌నాథ్ కేసు తీర్పులో రాజద్రోహం పెట్టే కారణాలు వివరించారు. ఇక్కడ రాజద్రోహం పెట్టిన కారణం పూర్తిగా బోగస్. హైకోర్టులో ఉపశమనం లభించలేదు, అందుకే సుప్రీంను ఆశ్రయించాం. ఎంపీపై కేసు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం లాంటిదే. -ముకుల్ రోహత్గీ, రఘురామ తరపు లాయర్

ఎడిమాకు అనేక వైద్య కారణాలు ఉంటాయి. ఫ్రాక్టర్‌ అస్పష్టంగా ఉంది. కొత్తదా, పాతదా అనేది నివేదికలో తేలదు. పోలీసులు టార్చర్ చేస్తే కాలి రెండోవేలు మీదే చేస్తారా?. దేశంలో పోలీసులు ఎక్కడా ఎంపీతో దురుసుగా ప్రవర్తించరు. అంతకుముందు ఎలాంటి ఫ్రాక్చర్ లేదని ఎక్స్-రే రిపోర్టులు ఉన్నాయి. ఎక్స్-రే రిపోర్టులు అబద్ధం ఆడవు.. ఈ ఫ్రాక్చర్ తర్వాత అయిందే. ఎంపీ రఘురామ సీబీఐ విచారణ కోరుతున్నారు. సీబీఐ విచారణ కోరేటంత అత్యవసరం ఏముంది?. రఘురామకు అందిస్తున్న చికిత్స అందరికీ సాధ్యం కాదు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశం పాటించలేదని హైకోర్టు ధిక్కరణ నోటీసు ఇవ్వడం సరికాదు. గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి.-దుష్యంత్ దవే, ప్రభుత్వం తరపు లాయర్

ABOUT THE AUTHOR

...view details