Gurukula PET Results 2017 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటనలు ఇస్తూ.. ఫలితాలు ప్రకటించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. గురుకుల పీఈటీ పోస్టులను కోర్టు ఆదేశాల ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. 2017 గురుకుల పోస్టుల్లో పీఈటీ అర్హత సాధించిన అభ్యర్థులతో కలిసి నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యలయం ముందు ఆందోళనకు దిగారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న అభ్యర్థులు.. వారి పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కమిషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అభ్యర్థులకు కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫలితాలు వెల్లడించక పోవడంతో మనస్తాపానికి గురై.. చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.