పెండింగ్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. నల్గొండ జిల్లా ప్రగతి కోసం వైఎస్‌ఆర్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2004లో ప్రారంభించారని... కానీ సొరంగ మార్గం మొత్తం 44 కిలోమీటర్లు ఉండగా ఇప్పటికి కేవలం 34 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. ఏజెన్సీ వైఫల్యంతో జిల్లా ప్రజలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటి రెడ్డి లేఖ - నల్గొండ జిల్లా తాజా వార్తలు
ఎస్‌ఎల్‌బీసీ పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఎస్‌ఎల్‌బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పని తీరును ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.
ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నల్గొండ జిల్లా ప్రజల సాగు, తాగు నీరు సమస్య పరిష్కారమై జిల్లా సస్యశ్యామలం అవుతుందని వివరించారు. బ్రహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయినప్పటికీ... ఆరు కిలోమీటర్ల కాలువ పనులు పూర్తికాకపోవడం వల్ల నీళ్లు వదలడం లేదని వివరించారు. ఆరు నెలల నుంచి ఆర్థిక ఇబ్బంది కారణంగా పనులు జరగటం లేదన్న ఆయన ఇప్పటి వరకు నాలుగు కిలోమీటర్ల కాల్వ పనులు మాత్రమే పూర్తి అయ్యాయన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:పచ్చని మొక్కలతో ఆహ్లాదం పంచుతున్న పొదరిల్లు