కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఏమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో... రాష్ట్ర ప్రజలందరికీ చికిత్స అందుబాటులో ఉండేట్లు ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. సంఖ్య తక్కువగా చూపిస్తున్నారని విమర్శించారు.
కరోనా విజృంభిస్తున్నా... ఎందుకు స్పందించడం లేదని.. ముందస్తు చర్యలకు పూనుకోకపోవడానికి కారణాలేమిటని నిలదీశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను పట్టించుకోకుండా ప్రజారోగ్య వ్యవస్థను గాలికి వదిలేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడంతో.. కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో...ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.